ఎంపీ రఘురామపై గచ్చిబౌలి పీఎస్ లో కేసు

ఎంపీ రఘురామపై గచ్చిబౌలి పీఎస్ లో కేసు

ఎంపీ రఘురామ కృష్ణరాజుపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌ భాషాను ఇంట్లో నిర్బంధించి దాడి చేశారని ఎంపీ రఘురామతో పాటు ఆయన కుమారుడు భరత్, పీఏ శాస్ర్తీ మరో ఇద్దరు CRPF సిబ్బందిపై కేసులు పెట్టారు పోలీసులు. A1గా- ఎంపీ రఘురామ కృష్ణం రాజు, A2 - భరత్ (S/o రఘురామ కృష్ణంరాజు), A3 - సందీప్ (CRPF కానిస్టేబుల్), A4 గా ASI CRPF, A5 శాస్త్రీ, (రఘురామ పీఏ ) పేర్లను చేర్చారు.  ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా చర్యల్లో భాగంగా ఐఎస్‌బీ గేట్‌ వద్ద విధుల్లో ఉండగా తనపై దాడి చేశారని ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌ భాషా ఫిర్యాదు చేశాడు. 

సీఎం కేసీఆర్ కు ఎంపీ రఘురామ లేఖ

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు లేఖ రాశారు. హైదరాబాద్ లోని తన నివాసం ముందు గుర్తు తెలియని ఆరుగురు వ్యక్తులు సోమవారం (జులై 4న) రెక్కీ నిర్వహించారని, వారిని పట్టుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో అప్పగించామని లేఖలో తెలిపారు. అయితే.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి ఈ కేసు విచారణకు సంబంధించిన విషయాలపై ఎలాంటి సమాచారం ఇప్పటి వరకూ రాలేదని, ఈ విషయం తనకు, తన కుటుంబ సభ్యుల భద్రతకు సంబంధించిన అంశమని లేఖలో చెప్పారు.

తనపై నిర్వహించిన రెక్కీని ఏపీ రాష్ట్ర క్యాడర్ లోకి తీసుకోవాలనుకున్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తేలికగా తీసుకున్నారని లేఖలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సీపీ స్టీఫెన్ రవీంద్ర మద్దతుగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తనకు వ్యక్తిగత భద్రత కల్పిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బందిపై గచ్చిబౌలి పోలుసులు కేసులు నమోదు చేయాలని చూస్తున్నారని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేలా చూడాలని, సీపీ స్టీఫెన్ రవీంద్రపై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కు రాసిన లేఖలో ఎంపీ రఘురామ కోరారు. 

మరోవైపు ఎంపీ రఘురామపై ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌ భాషా ఇచ్చిన ఫిర్యాదును, ఇటు ఎంపీ రఘురామ పీఏ శాస్త్రీ కానిస్టేబుల్‌ ఫరూక్‌ భాషాపై ఇచ్చిన ఫిర్యాదులను గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.