అమెరికాలో ఆంధ్ర యువకుడు మృతి

అమెరికాలో ఆంధ్ర యువకుడు మృతి

కాలిఫోర్నియా: అమెరికాలో సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ ఇంజనీర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్న ఏపీ యువకుడు తన బర్త్​డే వేడుకల సమయంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన సింగిరెడ్డి సాయి శ్రీహరి కృష్ణ  కాలిఫోర్నియాలోని ఓ జలపాతం వద్ద నీటిలో మునిగి మరణించారు. బర్త్​డే వేడుకలు జరుపుకోవడానికి శ్రీహరి స్నేహితులతో కలిసి కాలిఫోర్నియాలోని ఓ ప్రసిద్ధ జలపాతం సందర్శనకు వెళ్లారు. అక్కడ నీటిలో దిగిన సమయంలో బలమైన ప్రవాహంలో చిక్కుకుపోయారు. 

ఆయన నీటిలో మునిగిపోతుండడం చూసిన స్నేహితులు కాపాడడానికి ప్రయత్నించినప్పటికీ నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాలించగా శ్రీహరి కృష్ణ డెడ్​బాడీ దొరికింది. మృతుడి తల్లిదండ్రులు సింగిరెడ్డి శ్రీనివాసరావు, రమాదేవి తమ కుమారుడి మరణవార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యారు. విషయం తెలిసిన వెంటనే బొబ్బిలి ఎమ్మెల్యే  రంగారావు ఏపీ ఎన్ఆర్ఐ సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో మాట్లాడారు. శ్రీహరి భౌతిక కాయాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.