అందుబాటులోకి రిజిస్ట్రేష‌న్ సేవ‌లు.. తొలిరోజే రూ.కోటి ఆదాయం

అందుబాటులోకి రిజిస్ట్రేష‌న్ సేవ‌లు.. తొలిరోజే రూ.కోటి ఆదాయం

లాక్ డౌన్ కారణంగా 40 రోజుల పాటు ఏపీలో మూతపడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా మంగ‌ళ‌వారం తెరుచుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ జోన్ లలో 108 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రజలకు అందుబాటులోకి వ‌చ్చాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ (ఎస్‌ఆర్‌ఓ), జిల్లా రిజిస్ట్రార్‌ (డీఆర్‌), డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (డీఐజీ) ఆఫీసుల్లో సాధారణ సేవలు ప్రారంభం అయ్యాయి. లాక్ డౌన్ తరువాత తొలిరోజు రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో ప్రభుత్వానికి రూ. కోటి ఆదాయం వచ్చింది.

కరోనా వైరస్ నివారణ కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల సిబ్బంది, సేవల కోసం వచ్చే వారికి మాస్కులు తప్పనిసరి చేశారు. బయోమెట్రిక్‌ యంత్రాలను వినియోగించిన ప్రతిసారీ సిబ్బంది శానిటైజ్ చేశారు. వేలిముద్రలు, స్టాంపు పేపర్లు తీసుకునేప్పుడు, ఆ తరువాత కూడా చేతులు శానిటైజేషన్ చేసిన‌ట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమిషనర్ అండ్ ఐజి సిద్దార్ధ జైన్ తెలిపారు.