ఏపీలో రికార్డు స్థాయి కేసులు.. ఒక్క రోజే 304 మందికి వైరస్

ఏపీలో రికార్డు స్థాయి కేసులు.. ఒక్క రోజే 304 మందికి వైరస్

అమరావతి: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభన ఏమాత్రం తగ్గడం లేదు. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 304 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 6,456 కు పెరిగింది. ఏపీ కమాండ్ కంట్రోల్ రూమ్ సోమవారం ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, గత 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 15,173 శాంపిల్స్ పరీక్షించగా.. 246 మంది రిజల్ట్ పాజిటివ్ వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 52 మంది, విదేశాల నుంచి వచ్చిన మరో ఆరుగురికి పాజిటివ్ కన్ఫామ్ అయింది. కర్నూలు జిల్లాలో ఒకరు, అనంతపురం జిల్లాలో మరొకరు మృతి చెందారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 86 కు చేరుకుంది.

గడిచిన 10 రోజుల్లోనే 2000కు పైబడి జనం వైరస్ బారిన పడినట్లు ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. కేసుల నమోదు శాతం 1.11 పెరగగా.. రికవరీ రేటు ఆదివారం 53.90 శాతానికి పడిపోయింది. పది లక్షల మంది జనాభాకు 10,341 చొప్పున ఇప్పటివరకు 5,52,202 మందికి టెస్టులు నిర్వహించామని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకు మొత్తం 3,385 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.