శ్రీశైలంలో కరెంట్‌‌‌‌ ఉత్పత్తి ఆపించండి

శ్రీశైలంలో కరెంట్‌‌‌‌ ఉత్పత్తి ఆపించండి
  • కృష్ణా బోర్డుకు ఏపీ మరో లేఖ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: శ్రీశైలం లెఫ్ట్‌‌‌‌ పవర్‌‌‌‌ హౌస్‌‌‌‌లో కరెంట్‌‌‌‌ ఉత్పత్తి ఆపేయాలని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును మరోసారి కోరింది. తెలంగాణ ప్రభుత్వం వరద సీజన్‌‌‌‌ ప్రారంభం నుంచే ఇష్టం వచ్చినట్టుగా కరెంట్‌‌‌‌ ఉత్పత్తి చేస్తోందని, బోర్డు రిలీజ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ ఇవ్వకుండా నీటిని విడుదల చేయడం సరికాదంది. ఈమేరకు ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి కేఆర్‌‌‌‌ఎంబీ మెంబర్‌‌‌‌ డీఎం రాయ్‌‌‌‌పురేకు లెటర్ రాశారు. ఒక్క నెలలోనే కరెంట్‌‌‌‌ ఉత్పత్తి ఆపేయాలంటూ ఏపీ లెటర్ రాయడం ఇది మూడోసారి. బుధవారం నిర్వహించిన ఏపీ కేబినెట్‌‌‌‌ సమావేశంలో మరోసారి బోర్డుకు లేఖ రాయడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్‌‌‌‌ చేయాలని నిర్ణయించారు.

శ్రీశైలం రిజర్వాయర్‌‌‌‌లోకి సోమవారం వరకు ఎగువ నుంచి 17 టీఎంసీల ఇన్‌‌‌‌ఫ్లో వస్తే, అందులో టీఎస్‌‌‌‌ జెన్‌‌‌‌కో కరెంట్‌‌‌‌ ఉత్పత్తికి 6.90 టీఎంసీల నీటిని ఉపయోగించి నదిలోకి విడుదల చేసిందని తెలిపారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు సాగు, తాగునీటి అవసరాలు, చెన్నై తాగునీటి అవసరాలకు రిజర్వాయర్‌‌‌‌లో నీళ్లు నిల్వ ఉండకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. మినిమం డ్రా లెవల్‌‌‌‌ దిగువ నుంచి కరెంట్‌‌‌‌ ఉత్పత్తి పేరుతో నీటిని తోడేస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో కరెంట్‌‌‌‌ ఉత్పత్తి ద్వారానే తెలంగాణ ప్రభుత్వం రోజుకు 4 టీఎంసీలు తోడేసే ఆస్కారం ఉందని తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు.