సామాన్యులే కాదు, ఉన్నత చదువులు చదివిన విద్యావంతులు, డాక్టర్లను సైతం సైబర్ నేరగాళ్లు తమ మాయమాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. హైదరాబాద్ లోఓ ఎనస్తీషియన్‌ను ఆస్ట్రేలియాలో ఉద్యోగం పేరిట సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించిన ఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ యశోద ఆస్పత్రిలో ఎనస్తీషియన్‌గా పనిచేస్తున్న ఓ డాక్టర్ సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి రూ.10.15 లక్షలు పోగొట్టుకున్న ఘటన ఆదివారం (మార్చి 22) వెలుగులోకి వచ్చింది.
బాధితుడికి ఆస్ట్రేలియాలోని ప్రముఖ ఫియోనా స్టాన్లీ ఆస్పత్రిలో ఉద్యోగం ఉందంటూ నిందితులు మొదట ఈమెయిల్ పంపారు. అనంతరం నిందితులు బాధితుడికి ఇంటర్వ్యూ కాల్ చేసి, ఆయన ఉద్యోగానికి ఎంపికయ్యారని నమ్మించారు. అందుకు తగ్గట్టుగానే నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్‌ను కూడా పంపారు.
తమను తాము అమెరికన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ప్రతినిధులుగా పరిచయం చేసుకున్న నేరగాళ్లు.. వీసా ప్రాసెసింగ్, రిజిస్ట్రేషన్ ఫీజులు, సెక్యూరిటీ డిపాజిట్ అంటూ వివిధ కారణాలతో బాధితుడి నుంచి విడతల వారీగా రూ.10లక్షల15వేలు వసూలు చేశారు. డబ్బులు పంపిన తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో, తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
