హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లలో వంద శాతం విద్యుదీకరణ పూర్తి అయింది. ‘ధర్తీ ఆబా జన్జాతీయ గ్రామ్ఉత్కర్ష్అభియాన్' (డీఏజేజీయూఏ) లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 19,322 అంగన్వాడీ సెంటర్లలో కరెంట్మీటర్ల బిగింపు పూర్తయింది. జూలై 19న ప్రారంభించి రెండు దశల్లో అన్ని సెంటర్లకు కరెంట్ కనెక్షన్లు ఇచ్చినట్లు ఉత్తర, దక్షిణ విద్యుత్సంస్థల సీఎండీలు జితేశ్ వి.పాటిల్, వరుణ్రెడ్డి బుధవారం ప్రకటించారు.
అన్ని అంగన్వాడీ సెంటర్లను విద్యుదీకరించాలన్న సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఆదేశాలతో రంగంలోకి దిగిన విద్యుత్ పంపిణీ సంస్థలు స్త్రీ, శిశుసంక్షేమ శాఖ సహాయంతో విద్యుత్ సౌకర్యం లేని అంగన్ వాడీ సెంటర్లను గుర్తించారు.
సౌత్ డిస్కమ్పరిధిలో జూలై నెలలో తొలి దశ కింద 7,073 సెంటర్లలో, రెండో దశలో 1,904 సెంటర్లలో కరెంట్కనెక్షన్స్ఇచ్చారు. నార్త్ డిస్కమ్ పరిధిలో మొత్తం 10,345 అంగన్వాడీ సెంటర్లకు కరెంట్మీటర్లను బిగించి కనెక్షన్లు ఇచ్చారు.
ఇందుకోసం విద్యుత్శాఖలోని చీఫ్, సూపరిండెంట్, డివిజనల్, అసిస్టెంట్ ఇంజనీర్లు, లైన్ సిబ్బంది నెలరోజుల పాటు క్షేత్రస్థాయిలో పనిచేసినట్లు ఆఫీసర్లు ప్రకటించారు. లక్ష్యాన్ని పూర్తి చేసిన విద్యుత్ శాఖ సిబ్బందికి మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు.
విద్యుత్ శాఖ సిబ్బంది సుమారు నెల రోజుల శ్రమించి అన్ని అంగన్ వాడీ కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు సదరన్, నార్తర్న్ డిస్కమ్ ల సీఎండీలు జితేష్ వి.పాటిల్, వరుణ్ రెడ్డి తెలిపారు.
