- బాల్య వివాహాల నిరోధానికి ‘తరుణి’ సంస్థతో సర్కార్ ఒప్పందం: మంత్రి సీతక్క
- రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల్లో త్వరలోనే ‘బ్రేక్ఫాస్ట్ స్కూల్ స్కీమ్’ అమలు
హైదరాబాద్, వెలుగు: అంగన్వాడీ సెంటర్లు కేవలం పోషకాహార పంపిణీ కేంద్రాలు మాత్రమే కావని, చిన్నారుల బంగారు భవిష్యత్తుకు పునాదులని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. హైదరాబాద్ లోని గోల్కొండ ప్రాజెక్టు పరిధిలోని మల్లేపల్లిలో నిర్వహించిన ‘అమ్మ మాట - అంగన్వాడీ బాట’ కార్యక్రమాన్ని నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి, యూనిఫాంలు, విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.
అంగన్వాడీల్లో ప్రీ-స్కూల్ విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి చిన్నారిని ఈ సెంటర్లలో జాయిన్ చేయించాల్సిన బాధ్యత పేరెంట్స్ పై ఉందని ఆమె పిలుపునిచ్చారు. గతంలో అంగన్వాడీల్లో యూనిఫాంలు ఇచ్చే పరిస్థితి లేదని, కానీ తమ ప్రభుత్వం ప్రతి చిన్నారికి రెండు జతల యూనిఫాంలు అందజేస్తోందని మంత్రి వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన బ్రేక్ఫాస్ట్ పథకానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని, త్వరలోనే దీనిని రాష్ట్రవ్యాప్తంగా అన్ని అంగన్వాడీ సెంటర్లలో అమలు చేస్తామని ప్రకటించారు.
'బాల్య వివాహం-బతుకు ఆగం' అనే నినాదంతో..
రాష్ట్రంలో బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణలను పూర్తిగా అరికట్టేందుకు ‘తరుణి’ స్వచ్ఛంద సంస్థతో మహిళా శిశు సంక్షేమ శాఖ సోమవారం సెక్రటేరియట్ లో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల ఎడ్యుకేషన్ మధ్యలోనే ఆగిపోవడమే కాకుండా ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. ‘బాల్య వివాహం - బతుకు ఆగం’ అనే నినాదంతో సోషల్ మీడియా ద్వారా గ్రామ స్థాయి వరకు ప్రచారం నిర్వహిస్తామన్నారు.
ఈ ఒప్పందం ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందికి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి, బాలికల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆలా, తరుణి సంస్థ ప్రతినిధి మమతా రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.
పారిశుధ్యంలో నిర్లక్ష్యం చేస్తే సహించం
పల్లెలను స్వచ్ఛత, పచ్చదనానికి చిరునామాగా మార్చేందుకు అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సూచించారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సోమవారం సెక్రటేరియట్ నుంచి డీపీఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి సీతక్క పారిశుధ్య నిర్వహణ, నిధుల వినియోగం, వన మహోత్సవం, తాగునీటి భద్రత తదితర అంశాలపై ఆ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్తో కలిసి సమీక్ష నిర్వహించారు.
18 నుంచి వనమహోత్సవం..
గ్రామాల్లో స్వచ్ఛత, పచ్చదనం కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతో పాటు రూల్స్ బ్రేక్ చేసే వారిపై యాక్షన్ తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
