మంత్రి క్యాంప్‌‌ ఆఫీస్‌‌ ముట్టడి : అంగన్‌‌వాడీ టీచర్లు

మంత్రి క్యాంప్‌‌ ఆఫీస్‌‌ ముట్టడి : అంగన్‌‌వాడీ టీచర్లు

మహబూబాబాద్, వెలుగు : అంగన్‌‌వాడీలు సమ్మె విరమించాలని చెప్పడాన్ని నిరసిస్తూ గురువారం అంగన్‌‌వాడీ టీచర్లు మహబూబాబాద్‌‌లోని మంత్రి సత్యవతి రాథోడ్‌‌ క్యాంప్‌‌ ఆఫీస్‌‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా సీఐటీయూ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజు, బి.అజయ్, జిల్లా కార్యదర్శులు ఉపేందర్, వేషపల్లి నవీన్, జేఏసీ జిల్లా కార్యదర్శులు స్నేహబిందు, ఎల్లారీశ్వరిలు మాట్లాడుతూ అంగన్‌‌వాడీల సమస్యలు పరిష్కరించకుండా, మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె చేస్తున్న వారితో కాకుండా, సమ్మెలో లేని సంఘాలతో మాట్లాడి సమస్య పరిష్కారం అయిందని చెప్పడం సరికాదన్నారు. 

తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని ఆశించిన వారికి నిరాశే మిగిలిందన్నారు. అంగన్‌‌వాడీ టీచర్లు, హెల్పర్లకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని కోరారు. రెగ్యులరైజేషన్, కనీస వేతనం, గ్రాట్యూటీ, రిటైర్‌‌మెంట్‌‌ బెనిఫిట్స్‌‌, పెన్షన్‌‌ వంటి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కుమ్మరికుంట్ల నాగన్న, కందునూరి శ్రీనివాస్‌‌,  దుండు వీరన్న, పోతుగంటి మల్లయ్య, దాసరి మల్లేశ్‌‌, బెస్త సంపూర్ణ, గుగులోతు సరోజ, తిరుపతమ్మ, స్వరూప పాల్గొన్నారు .