రోజుకో రూపంలో ఆందోళన..వెనక్కి తగ్గని అంగన్​వాడీలు

రోజుకో రూపంలో ఆందోళన..వెనక్కి తగ్గని అంగన్​వాడీలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అంగన్​వాడీ టీచర్లు, హెల్పర్లు తమ సమస్యల పరిష్కారం కోసం 15రోజులుగా సమ్మె చేస్తున్నా  ప్రభుత్వం నుంచి  స్పందన రావడం లేదు. దీంతో సిబ్బంది సమ్మె మరింత తీవ్రం చేస్తున్నారు.  తాము చర్చలకు సిద్ధమని పేర్కొంటున్నప్పటికీ  ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.  సర్కార్​ వెంటనే స్పందించకపోతే..  ఎమ్మెల్యేల ఇండ్లను దిగ్భంధనం చేస్తామని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు. 

ఆందోళనలు ఉధృతం 

తమ  డిమాండ్ల సాధన కోసం ప్రజాస్వామ్య యుతంగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొట్టేలా  వ్యవహరిస్తోందని అంగన్​ వాడీ టీచర్లు, ఆయాలు  అంటున్నారు.  జిల్లాలో దాదాపు 2060అంగన్​వాడీ సెంటర్లున్నాయి.  సమ్మెతో కొన్ని సెంటర్లలోని గర్బిణులు, బాలింతలకు పూర్తి స్థాయిలో ఎగ్స్​, పప్పు, నూనెలు అందడం లేదు.  అంగన్​వాడీ టీచర్లు, హెల్పర్స్​, మినీ టీచర్లను పర్మినెంట్​ చేయాలని, కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని,   టీచర్లకు రూ. 10లక్షలు గ్రాట్యూటీ ఇవ్వాలని  డిమాండ్​ చేస్తే..  ఈ నెల 11న   సమ్మె  చేపట్టారు.  

సమ్మె చేస్తున్న టీచర్లు, వర్కర్లు సెంటర్లకు తాళాలు వేయగా..  కలెక్టర్​ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అధికారులు 1800 అంగన్​వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టారు.  న్ని చోట్ల తాళాలు పగుల గొడ్తుండగా అంగన్​వాడీ టీచర్లు అడ్డుకున్నారు.  కొత్తగూడెంలో సోమవారం  ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్​వాడీ టీచర్స్​, హెల్పర్స్​ యూనియన్ల ప్రతినిధులతో ప్రత్యేక మీటింగ్​ నిర్వహించారు.

ఎమ్మెల్యేల ఇండ్లను దిగ్భందనం చేయడంతో పాటు రోజుకో తీరున నిరసనలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాన్నున్నట్టు యూనియన్ల నేతలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చలు జరపాలని, సమ్మెను విరమించేలా చర్యలు చేపట్టాలని  లేకపోతే..  ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని,  అంగన్​వాడీలు పేర్కొంటున్నారు.  

 భిక్షాటన చేసి .. కళ్లకు గంతలు కట్టుకొని 

 జూలూరుపాడు/మణుగూరు :   సమ్మెలో భాగంగా సోమవారం మణుగూరులో అంగన్​వాడీలు జిల్లాలో  పలుప్రాంతాలో వినూత్నంగా నిరసనలు తెలిపారు.    జూలూరుపాటు మండల కేంద్రంలో భిక్షాటన చేశారు. మణుగూరులో కళ్లకు గంతలు కట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.   15 రోజులుగా తమ  డిమాండ్లను పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నా   ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు.

 అంగన్​వాడీల ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే సతీమణి పాయం ప్రమీల,  ఏఐటీయూసీ  జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్  భూక్యా లలిత  మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్యామల, హేమలత, మల్లేశ్వరి, భారతి, విజయ, అరుణ, సావిత్రి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


తాళాలను ఎట్లా పగల గొట్టిస్తరు 

అంగన్​వాడీ సెంటర్ల అద్దె బకాయిలు నెలల తరబడి పేరుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అద్దె బకాయిలు ఇవ్వని ప్రభుత్వం సెంటర్ల తాళాలను బలవంతంగా ఎట్లా పగల గొట్టిస్తది. రెచ్చ గొట్టే చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ కలెక్టరేట్లు, ఎమ్మెల్యేల ముట్టడితో పాటు దశలవారీ ఆందోళనలను ఉధృతం చేయనున్నాం.
 
–  పద్మ, గోనె మణి, అంగన్​వాటీ టీచర్స్​, హెల్పర్స్​ యూనియన్​ లీడర్​