ODI World Cup 2023: నేను అవుట్ కాదు.. ఇదిగో ప్రూఫ్: అంపైర్‌పై ఐసీసీకి ఫిర్యాదు చేసిన మాథ్యూస్

ODI World Cup 2023: నేను అవుట్ కాదు.. ఇదిగో ప్రూఫ్: అంపైర్‌పై ఐసీసీకి ఫిర్యాదు చేసిన మాథ్యూస్

వరల్డ్ కప్ లో భాగంగా నిన్న(నవంబర్ 6)బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ వివాదాస్పద రీతిలో ఔటైన సంగతి తెలిసిందే. ఐసీసీ నియ‌మాల ప్ర‌కారం ఒక బ్యాట‌ర్ ఔట‌య్యాక‌.. కొత్త‌గా వ‌చ్చే ఆట‌గాడు 2 నిమిషాల్లోపే క్రీజులో ఉండాలి. కానీ ఈ రూల్ అతిక్రమించిన శ్రీలంక ఆల్ ఆల్ రౌండర్.. హెల్మెట్ స‌రిగ్గాలేద‌నే కార‌ణంతో ఆలస్యం చేసాడు. దీంతో నిర్ధేశించిన సమయంలోపు అతడు బంతిని ఎదర్కోనందుకు అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు. అయితే  మాథ్యూస్ మాత్రం ఫోర్త్ అంపైర్ పై ఐసీసీకు ఫిర్యాదు చేసాడు. 

మరో 5 సెకన్ల సమయం మిగిలే ఉంది  

తనను టైమ్డ్ ఔట్ గా అంపైర్ ప్రకటించినందుకు విమర్శలు గుప్పించాడు. ట్విట్టర్ వేదికగా ఫోర్త్ అంపైర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. తప్పంతా ఫోర్త్ అంపైర్ లోనే ఉందని.. నేను హెల్మెట్ మార్చుకున్న తర్వాత మరో 5 సెకన్ల సమయం ఉంది అంటూ స్క్రీన్ షాట్ లను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ప్రస్తుతం ఈ స్క్రీన్ షాట్స్ వైరల్ గా మారుతుండడంతో ఐసీసీకి మాథ్యూస్ అవుట్ విషయంలో ఏం చేస్తుందో చూడాలి. బంగ్లాదేశ్ ఆటగాళ్లు మాథ్యూస్ అవుట్ విషయంలో తమ అప్పీల్ ను నిరాకరించడంతో ఆ జట్టుకు  క్రీడా స్ఫూర్తి లేదంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. 

ఏం జరిగిందంటే..? 

శ్రీలంక ఇన్నింగ్స్ 25వ ఓవర్ రెండో బంతికి సమరవిక్రమ క్యాచ్ ఔటయ్యాడు. అతని స్థానంలో క్రీజులోకి రావాల్సిన మాథ్యూస్ సమయాన్ని వృథా చేస్తూ అలసత్వం వహించాడు. సరైన సమయానికి మైదానంలో అడుగుపెట్టినా.. హెల్మెట్‌ సమస్య వల్ల మరొకటి కావాలని డ్రెస్సింగ్ రూమ్ వైపు సైగలు చేశాడు. వెంటనే కరుణరత్నే పరిగెత్తుకుంటూ వచ్చి అతనికి హెల్మెట్‌ అందించాడు. అయితే ఇదంతా జరగడానికి రెండు నిమషాల పైగా సమయం పట్టింది. నిబంధనల ప్రకారం బంగ్లా ఫీల్డర్లు అప్పీల్ చేయడంతో అంపైర్ ఔట్‌గా ప్రకటించారు.

ALSO READ : ODI World Cup 2023: స్టీవ్ స్మిత్‌కు అరుదైన వ్యాధి.. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌కు దూరం

బంగ్లాదేశ్ ఘన విజయం 

ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ శ్రీలంకపై 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 280 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన షకీబ్ సేన 41.1 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి ఛేజ్ చేసింది. శాంటో(90), షకీబ్(82) అర్ధ సెంచరీలతో బంగ్లా జట్టును గెలిపించారు. అంతకు ముందు అసలంక(108) సెంచరీతో శ్రీలంక 279 పరుగులకు ఆలౌటైంది.