
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అధికార వైసీసీ నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే నాలుగు జాబితాలను విడదుల చేయగా ఐదో జాబితాపై కసరత్తు జరుగుతుంది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, బిజినెస్ మెన్ చలమలశెట్టి సునీల్ సీఎం జగన్‌తో ఇవాళ వేర్వేరుగా సమావేశమయ్యారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో వారు జగన్ ను కలిశారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా చేసిన క్రమంలో బీసీ అభ్యర్థిని అక్కడ పోటీలో నిలబెట్టాలని అనుకున్నట్లుగా సీఎం జగన్ అనిల్ కుమార్ యాదవ్ తో చర్చించారు. జగన్ నిర్ణయం పట్ల అనిల్ కుమార్ యాదవ్ కూడా సుముఖత వ్యక్తం చేశారు.
అనిలే ఎందుకు ?
ఏపీ ఎంపీ సీట్లలో పల్నాడు జిల్లా పరిధిలోకి వచ్చే కీలకమైన నరసరావుపేట స్ధానం కూడా ఒకటి. ఇక్కడ అభ్యర్థిని ప్రకటించడం అనేది రాజకీయ నాయకులకు సవాల్ తో కూడుకున్న పని. రాజకీయ, కుల సమీకరణాలే అందుకు కారణం. గత ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన లావు కృష్ణదేవరాయల్ని బరిలో దింపి సీఎం జగన్ ప్రయోగాన్ని చేసి విజయం సాధించారు. అయితే అప్పుడు వైసీపీ హవాలో గెలిచిన లావు.. మరోసారి అక్కడ గెలవలేరనే నిర్ణయానికి వచ్చిన జగన్ ఈ సారి బీసీ అభ్యర్ధి వైపు ఫోకస్ పెట్టారు. ఇప్పటికిప్పుడు కొత్తగా బీసీ అభ్యర్థని తీసుకువస్తే కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుంది. దీంతో అనిల్ కుమార్ యాదవ్ బీసీ నేత కావడం, పైగా యువకుడు, ఉత్సాహవంతుడు, పార్టీకి విధేయుడు కావడంతో అనిల్ ను ఈసారి నరసరావుపేట పార్లమెంటు నుంచి పోటీ చేయాలని జగన్ కోరినట్లు తెలుస్తోంది. దీని ద్వారా బీసీ ఓటు బ్యాంకు మొత్తాన్ని క్యాష్ చేసుకోవాలనేది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది.