
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనగానే మొదటగా ఎవరికైనా ఠక్కున గుర్తొచ్చేది అనీల్ కుంబ్లే పేరు. లెగ్ స్పిన్నర్ గా దాదాపు రెండు దశాబ్దాల పాటు కుంబ్లే తనదైన మార్క్ తో టాప్ బౌలర్లలో ఒకడిగా కెరీర్ ముగించాడు. 18 సంవత్సరాలు భారత జట్టుకు సేవలను అందించిన ఈ లెగ్ స్పిన్నర్ నేటితో క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చి 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఆగష్టు 9, 1990 న టెస్ట్ క్రికెట్ లో కుంబ్లే అరంగేట్రం చేసాడు. ఇంగ్లాండ్ పై జరిగిన తన తొలి మ్యాచ్ లో రెండు వికెట్లు పడగొట్టాడు. 1990 లో టెస్ట్ అరంగేట్రం చేసిన ఈ స్పిన్ మాంత్రికుడు 2008లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కుంబ్లే అరంగేట్ర సందర్భంగా అతని కెరీర్ లో హైలెట్స్ చూద్దాం..
ఇప్పటికే మర్చిపోలేని 10 వికెట్ల ఘనత:
1999 జనవరి నెలలో భారత పర్యటనకు వచ్చిన పాకిస్తాన్ టీమ్.. రెండు టెస్టుల్లో తలపడింది. ఫిబ్రవరి 4న ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో ప్రారంభమైన ఆ టెస్టులో భారత్ గెలిస్తేనే సిరీస్ ను కాపాడుకుంటుంది. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 252 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆపై అనిల్ కుంబ్లే (4 వికెట్లు), హర్భజన్ (3 వికెట్లు) దెబ్బకు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే చాపచుట్టేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 339 పరుగులు చేసిన భారత్.. పాక్ ముందు 420 పరుగుల టార్గెట్ ను ఉంచింది.
రెండో ఇన్నింగ్స్ లో పాక్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి పాక్ ను పటిష్ట స్థితికి చేర్చారు. ఆ తరుణంలో తొలి వికెట్ గా షాహిద్ ఆఫ్రిదిని ఔట్ చేసిన తన వేటను ప్రారంభించాడు కుంబ్లే. వరుసగా వికెట్లు సాధిస్తూ.. 207 పరుగులకే పాక్ ను కుప్పకూల్చాడు. భారత్ కు 212 పరుగుల భారీ విజయాన్ని అందించాడు. దాంతొ ఒక ఇన్నింగ్స్ లో పదికి పది వికెట్లు సాధించి ఆ ఘనత నమోదు చేసిన రెండో బౌలర్‌గా చరిత్రకెక్కాడు.
అనిల్ కుంబ్లే కెరీర్ గణాంకాలు
అనిల్ కుంబ్లే తన 18 ఏళ్ల కెరీర్‌లో 132 టెస్టులు, 271 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ దిగ్గజ స్పిన్నర్ ఓవరాల్ గా తన అంతర్జాతీయ కెరీర్ లో 956 వికెట్లు పడగొట్టాడు. స్పిన్నర్ గా టాప్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన కుంబ్లే.. బ్యాటింగ్ లోనూ కొన్ని గొప్ప ఇన్నింగ్స్ లు ఆడాడు. కుంబ్లే రెండు ఫార్మాట్లలో కలిపి 3444 పరుగులు చేశాడు. అతని పేరు మీద ఒక టెస్ట్ సెంచరీ కూడా ఉంది. 2002 ఛాంపియన్స్ ట్రోఫీ, 1995 ఆసియా కప్‌ను గెలుచుకున్న జట్టులో సభ్యుడు. 42 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించి 45 వికెట్లు పడగొట్టాడు.