మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు' . ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ నిలిచి రూ. 300 కోట్ల మార్క్ ను దాటింది. సంక్రాంతి బరిలో జనవరి 12, 2026న రిలీజ్ అయి ఈ సినిమా 10 రోజులు దాటినా.. మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. వరుస విజయాలను అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి, ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయారు. అయితే ఈ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్, తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఇద్దరు క్రేజీ హీరోలను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది.
నెక్స్ట్ టార్గెట్ అఖిల్?
'ఏజెంట్' సినిమా ఫలితం తర్వాత సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని వారసుడు అఖిల్ కి, అనిల్ రావిపూడి ఒక భారీ కమర్షియల్ సబ్జెక్ట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అఖిల్ లోని ఎనర్జీని పూర్తిస్థాయిలో వాడుకోవాలని అనిల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ యంగ్ హీరోను ఒక పవర్‌ఫుల్ మాస్ రోల్‌లో ప్రెజెంట్ చేస్తే, అది మాస్ ఆడియన్స్‌కు బాగా రీచ్ అవుతుందని దర్శకుడి నమ్మకం. సాధారణంగా అనిల్ రావిపూడి ఒక సినిమాను 6 నెలల్లోనే పూర్తి చేస్తారు. అఖిల్ సినిమాను కూడా అదే వేగంతో పూర్తి చేసి, అతనికి ఒక సాలిడ్ హిట్ ఇవ్వాలని చూస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ముగింపు దశలో 'లెనిన్'..
అఖిల్ ప్రస్తుతం మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో 'లెనిన్' అనే పీరియడ్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా కాలంగా జరుగుతోంది. మొదట శ్రీలీల హీరోయిన్‌గా అనుకున్నప్పటికీ, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఇప్పుడు ఆ స్థానంలో 'మిస్టర్ బచ్చన్' ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఒక పల్లెటూరి నేపథ్యంతో సాగే వినూత్నమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
దగ్గుబాటి మల్టీస్టారర్?
మరోవైపు, అనిల్ రావిపూడి తన ఫేవరెట్ హీరో వెంకటేష్‌తో మరో సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాని టాక్. అయితే ఇందులో 'రానా నాయుడు' వెబ్ సిరీస్ తర్వాత వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి వెండితెరపై కనిపించబోతున్నారని సమాచారం. ఇది అనిల్ రావిపూడి మార్క్ కొత్త కథా లేక 'సంక్రాంతి వస్తున్నాం' సినిమాకు సీక్వెలా అన్నది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. ప్రస్తుతం వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే అనిల్ రావిపూడి - దగ్గుబాటి హీరోల సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
►ALSO READ | SS Rajamouli: ప్రియాంక చోప్రా నటనకు జక్కన్న ఫిదా.. ‘ది బ్లఫ్’ ట్రైలర్‌పై రాజమౌళి క్రేజీ కామెంట్స్!
అనిల్ సక్సెస్ మంత్రం
ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎమోషన్ కలిపి సినిమాలను తీయడంలో అనిల్ రావిపూడి సిద్ధహస్తుడు. 'ఎఫ్ 2', 'ఎఫ్ 3' , 'భగవంత్ కేసరి' 'మన శంకర వరప్రసాద్ గారు' వంటి సినిమాలతో ఆయన తన రేంజ్ మార్చుకున్నారు. ఇప్పుడు చిరంజీవి వంటి సీనియర్ హీరోలతో పాటు అఖిల్ వంటి యంగ్ హీరోలను హ్యాండిల్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. వరుస పరాజయాలతో ఉన్న అఖిల్‌కు అనిల్ రావిపూడి ఒక 'బూస్టర్ డోస్' లాంటి హిట్ ఇస్తారని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు. అధికారిక ప్రకటన వస్తే తప్ప ఈ ప్రాజెక్టుల గురించిన పూర్తి స్పష్టత రాదు..
