ఇది యానిమల్స్ ఫెస్టివల్ సీజన్.!హైదరాబాద్ లో రెండు రోజులు పెట్ షో

ఇది యానిమల్స్ ఫెస్టివల్ సీజన్.!హైదరాబాద్ లో రెండు రోజులు పెట్ షో

‘‘మీ మనుషులకేనా పండుగలు.. మాకూ ఉన్నాయి.. మేమూ సెలబ్రేట్ చేసుకుంటాం” అంటున్నాయా? అన్నట్లు ఎంత ముద్దుగా ముస్తాబు అయ్యాయో చూడండి ఈ జంతువులు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూసినా యానిమల్స్​ను ప్రేమగా చూసుకునేవాళ్లెందరో! ఇక పెట్ లవర్స్ అయితే చెప్పనక్కర్లేదు.. తమ పెట్స్​కు బర్త్​ డేలు చేస్తుంటారు. అవి కూడా అలానే విశ్వాసంగా ఉంటూ ఎంతో ప్రేమను కురిపిస్తాయి. మనుషులతో మమేకమైన చాలా జంతువులకు, వాటి ప్రాధాన్యతను తెలిపేందుకు స్పెషల్స్ డేలు కూడా ఉన్నాయి. అయితే ఈ జంతువుల పండుగలు కల్చర్​కు దగ్గరగా ఉండేలా సెలబ్రేట్ చేస్తారు. ఆ యానిమల్ ఫెస్టివల్స్​ గురించి బోలెడన్ని సంగతులే ఇవి.

కోతుల పండుగ

మనదగ్గర కోతులు గురించి మాట్లాడితే.. ‘ఒకప్పుడు కోతులు అడవుల్లో ఉండేవి. ఇప్పుడు ఇండ్లలోకి వస్తున్నాయి. దీంతో ఎన్నోసార్లు అనేక ఇబ్బందులు తలెత్తాయ’ని అంటుంటారు. ఇంకా కోతి చేష్టలు చేయకు.. అనే మాటలు వినే ఉంటారు. మనవాళ్లు కోతుల బెడద ఎప్పుడు తప్పుతుందా? ఎలా తప్పించుకోవాలా? అని ఆలోచిస్తుంటే.. థాయ్​లాండ్​లో మాత్రం కోతుల కోసం ప్రత్యేకంగా పండుగ సెలబ్రేట్ చేస్తున్నారు అక్కడివాళ్లు. థాయ్​లాండ్​లోని లోప్​బురిలో ప్రతి ఏటా ది మంకీ బఫెట్​ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఫెస్టివల్​ లోకల్​గా దొరికే పీతలను తినే మకాక్​ జాతిని గౌరవిస్తూ జరుపుకుంటారు. దానివల్ల అదృష్టం, సంపదలు వస్తాయని నమ్ముతారు. ఈ పండుగ కోతి వేషం వేసుకున్న వాళ్ల డాన్స్​లతో మొదలవుతుంది. కోతులు రాగానే ఆతిథ్యం ఇచ్చేవాళ్లు బ్యాంకెట్​ టేబుల్స్ మీద షీట్స్ తొలగించి పండ్లు, కూరగాయలతో అలంకరించిన వాటిని రివీల్​ చేస్తారు. 

హైదరాబాద్​లో పెట్ షో!

హైదరాబాద్​లోని నార్సింగిలో ‘హైక్యాన్ 2025’ పేరుతో నవంబర్ 8,9 తేదీలలో ఒక భారీ పెట్​ షో జరగబోతుంది. ఇది ప్రతి ఏటా జరిగే వేడుకే. ఇందులో పెంపుడు జంతువులంటే ఇష్టపడేవాళ్ల కోసం సౌత్ ఇండియాలో జరిగే బిగ్గెస్ట్ ఈవెంట్​లలో ఒకటి. ఈ సెలబ్రేషన్​లో 500 పైగా శునకాలతో డాగ్​ షో ఉంటుంది. ఈ పోటీలో దేశం నలుమూలల నుంచి డాగ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. ఇంటర్నేషనల్ జడ్జ్​లు విజేతలను ప్రకటిస్తారు. ఆ తర్వాత దాదాపు 100కి పైగా పిల్లులతో క్యాట్​ షో ఉంటుంది. దాదాపు వంద రకాల డెకరేటివ్​ ఫిష్​ల డిస్​ ప్లే ఉంటుంది. డాగ్, క్యాట్ గ్రూమింగ్​ సెమినార్​లు ఉంటాయి. సేఫ్ విత్ డాగ్స్ క్యాంపెయిన్ చేస్తారు. అలాగే పెట్ ఫ్యాషన్ షో, గేమ్స్, ప్లీ మార్కెట్, ఫుడ్ కోర్ట్​ వంటివి ఉంటాయి. అయితే తొలిసారి ఈ ఈవెంట్​లో దేశం కోసం విశిష్ట సేవలు అందించిన సర్వీస్​ డాగ్స్​కు ‘నేషనల్ కె9 బ్రేవరీ అవార్డులు’ ప్రదానం చేయబోతున్నారు. పెట్ ఓనర్స్​కు ఎంట్రీ ఫీజు లేదు. ఇవే కాదు.. నవంబర్​ 1న, అమెరికాలోని ఫ్లోరిడాలో రైట్ వేల్ ఫెస్టివల్, 3న, ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ జెల్లీ ఫిష్​ డే, 22–23న పుణెలో పెట్ ఫెడ్, 29న ఇంటర్నేషనల్ జాగ్వార్ డే వంటివి సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు ఇవి నవంబర్​లోనే ఎందుకు జరుపుతారంటే సంస్కృతులు, సంప్రదాయాలు, వ్యవసాయ పనులు వంటి కారణాల వల్ల ఈ పండుగలు సెలబ్రేట్​ చేసుకోవడానికి సీజన్ అనుకూలంగా ఉంటుంది. 

పుష్కర్​ కేమెల్ ఫెయిర్

మనదేశంలో అత్యంత ఆర్భాటంగా జరిగే జంతువుల పండుగ ‘పుష్కర్ కేమెల్ ఫెయిర్​’. ఇది పుష్కర్​ టౌన్​లో జరుగుతుంది. ఇది మనదేశంలో జరిగే అతిపెద్ద ఒంటె, గుర్రం, పశువుల పండుగలలో ఒకటి. ఇది అక్టోబర్​ 30 నుంచి నవంబర్ 5 వరకు జరుగుతుంది. హిందువులు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను సందర్శించే సీజన్ ఇది. అందుకే సందర్శకులను ఆకర్షించేలా రంగురంగుల వస్తువులతో వేలకొద్దీ జంతువులు కనిపిస్తాయి. వాటిలో ముఖ్యంగా ఒంటెలు, గుర్రాలు, పశువులను కలర్​ఫుల్​గా ముస్తాబు చేస్తారు. అంతటితో అయిపోదు.. ఈ ఫెయిర్​లో ఒంటె పందాలు, డాన్స్​లు, సంప్రదాయ సంగీతం, కేమెల్ బ్యూటీ కాంటెస్ట్​లతోపాటు పుష్కరిణి నది దగ్గర మతాచార కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ పుష్కర్​ ఫెయిర్​లో దాదాపు రెండు లక్షల మందికి పైగా పాల్గొంటారు.