దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరుగాంచిన అన్నపూర్ణ స్టూడియోస్ ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు సినీ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసిన ఈ బ్యానర్.. తొలిసారిగా తెలుగేతరుల చిత్రాన్ని పంపిణీ చేయడానికి సిద్ధమైంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ తో సంచలనం సృష్టిస్తున్న మలయాళ చిత్రం 'EKO' ప్రాంతీయ పంపిణీ హక్కులను అన్నపూర్ణ స్టూడియోస్ దక్కించుకుంది. ఈ మిస్టరీ థ్రిల్లర్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నవంబర్ 21న ప్రపంచవ్యాప్త విడుదల రోజునే ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
'EKO' ఎందుకంత ప్రత్యేకత?
'EKO' చిత్రం ఇప్పటికే తన అద్భుతమైన విజువల్స్, కథనంలో ఉన్న కొత్తదనంతో సినీ వర్గాలలో ఆసక్తిని రేకెత్తించింది. కేరళ కొండల నేపథ్యంలో సాగే ఈ మిస్టరీ థ్రిల్లర్, ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనుంది. ఈ సినిమాలో కురియాచన్ పాత్రలో సందీప్ ప్రదీప్ నటిస్తున్నారు. ఆయనతో పాటు వినీత్, నరైన్, బిను పప్పు, అశోకన్ వంటి బలమైన నటీనటులు, అలాగే అంతర్జాతీయ నటులు బియానా మోమిన్, సిమ్ ఝి ఫీ, ఎన్.జి. హంగ్ షెన్ నటించడం సినిమా స్థాయిని పెంచింది. ఈ విభిన్నమైన నటీనటుల కలయికే 'EKO' పట్ల ఉత్సాహాన్ని పెంచుతోంది.
అన్నపూర్ణ స్టూడియోస్ ఉద్దేశ్యం ఏమిటి?
ఈ కొత్త భాగస్వామ్యం గురించి అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ.. "EKO వంటి సినిమాలు కొత్త ఆలోచనలకు తాము ఎందుకు మద్దతు ఇస్తున్నామో గుర్తుచేస్తాయి. ఇది మా బ్యానర్‌కు ఒక ముఖ్యమైన క్షణం. మలయాళ చిత్రమైన 'EKO' ను ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో పంపిణీ భాగస్వాములుగా తీసుకురావడం మాకు సంతోషంగా ఉంది. ఇది మేము పంపిణీ చేస్తున్న తొలి తెలుగేతరుల చిత్రం కావడం విశేషం అని అన్నారు. ఆసక్తికరమైన కథాంశాలు, వినూత్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలనేది అన్నపూర్ణ స్టూడియోస్ లక్ష్యామని నాగ్ తెలిపారు.
మిస్టరీ థ్రిల్లర్..
'EKO' చిత్రానికి దింజిత్ అయ్యత్తాన్ దర్శకత్వం వహించగా.. కథ, సినిమాటోగ్రఫీ బాధ్యతలను బాహుల్ రమేష్ నిర్వహించారు. ఎంఆర్‌కె ఝయారం 'ఆరాధ్య స్టూడియోస్' పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ముజీబ్ మజీద్ సంగీతం, సూరజ్ ఇ.ఎస్. ఎడిటింగ్, సజీష్ తమరస్సేరి కళా దర్శకత్వం వహించారు. బలమైన నిర్మాణ విలువలు, కట్టిపడేసే కథనంతో రూపొందిన 'EKO' చిత్రం నవంబర్ 21న థియేటర్లలో సందడి చేయనుంది. తెలుగు ప్రేక్షకులు ఒక ప్రత్యేకమైన మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు.
