కన్నెపల్లిలో డీ వాటరింగ్‌‌‌‌‌‌‌‌కు ఆటంకాలు

 కన్నెపల్లిలో డీ వాటరింగ్‌‌‌‌‌‌‌‌కు ఆటంకాలు
  • ఐదు రోజులుగా మోటార్లు నడిపిస్తున్నా తగ్గని నీటిమట్టం 
  •     14  మోటార్లతో నీటిని ఎత్తిపోస్తున్న ఆఫీసర్లు 
  •     అన్నారంలో బురద కడగటానికి రోజూ వంద మంది కూలీలు
  •     పంపులు, మోటార్ల పరిస్థితిపై పెదవి విప్పని సర్కారు

జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: గోదావరి వరదలతో ఇటీవల నీట మునిగిన కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం పంప్​హౌజ్​​ బయటపడ్డా కన్నెపల్లి పంప్​హౌజ్​​ ఇంకా తేలలేదు. కన్నెపల్లి వద్ద ఐదు రోజులుగా డీ వాటరింగ్‌‌‌‌‌‌‌‌ జరుగుతున్నా  నీటి మట్టం తగ్గడం లేదు. ఇప్పటికీ రెండు ఫ్లోర్లు మాత్రమే బయటపడ్డాయి. ఆ ఫ్లోర్ల  నిండా బురదే కనిపిస్తోంది. మరోవైపు డీ వాటరింగ్‌‌‌‌‌‌‌‌తో బయటపడ్డ అన్నారం పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌ మోటార్ల చుట్టూ టన్నుల కొద్దీ చెత్త, బురద పేరుకుపోయింది. దీనిని ఎత్తి బయట పారబోయడానికి రోజుకు వంద మంది కూలీలు​ పనిచేస్తున్నారు. పంప్​హౌజ్​​ల రూపంలో కోట్ల రూపాయల ప్రజాధనం నీళ్లలో మునిగి ఉంటే  మోటర్లు, పంపుల పరిస్థితిపై  ఎప్పటికప్పుడు బులెటిన్​ రిలీజ్ ​చేయాల్సిన సర్కారు డీవాటరింగ్​ పనులను అత్యంత గుట్టుగా చేస్తోంది.  పనికి వచ్చే లేబర్‌‌‌‌‌‌‌‌, పర్యవేక్షణ చేసే ఇంజినీర్లను కూడా మొబైల్ ఫోన్స్ వాడకూడదని ఆదేశించింది.

అన్నారంలో టన్నుల కొద్దీ బురద

అన్నారం పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌లో డీవాటరింగ్‌‌‌‌‌‌‌‌ పనులు పూర్తి కాగా 12 మోటార్లు బయటపడ్డాయి. డిజిటల్‌‌‌‌‌‌‌‌ సపోర్ట్‌‌‌‌‌‌‌‌ సిస్టం,  కంట్రోల్‌‌‌‌‌‌‌‌ ప్యానెల్స్‌‌‌‌‌‌‌‌, ఎలక్ర్టికల్‌‌‌‌‌‌‌‌ ఛార్జెస్‌‌‌‌‌‌‌‌, బ్యాటరీ రూమ్‌‌‌‌‌‌‌‌లలో టన్నుల కొద్దీ బురద పోగయ్యింది. దీన్ని తొలగించడానికి పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌కు దగ్గరలో ఉన్న సిరిపురం, సింగరేణిపల్లె, గుంజపడుగు, చిల్లపల్లె తదితర గ్రామాల నుంచి డెయిలీ వంద మంది లేబర్లను రప్పిస్తున్నారు. వారితో బురద ఎత్తి బయట పారబోసే పనులు చేయిస్తున్నారు. ఇక్కడ ఇంకా 115 మీటర్ల లోతులో ఉన్న కంట్రోల్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌ బయట పడాల్సి ఉంది. పనులు జరుగుతున్న తీరు, మోటార్ల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇయ్యాల్సిన సర్కారు గుట్టుగా పనులు చేయిస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్ని నీళ్లు ఎత్తిపోసినా.. 

కన్నెపల్లి పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌ఈ నెల 14న నీట మునిగితే 9 రోజులు ఆలస్యంగా డీ వాటరింగ్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. 1500 హెచ్‌‌‌‌‌‌‌‌పీ సామర్థ్యం కలిగిన 14 మోటార్లను అమర్చి ఫోర్‌‌‌‌‌‌‌‌బే లోని నీటిని హెడ్‌‌‌‌‌‌‌‌ రెగ్యులరేటర్‌‌‌‌‌‌‌‌ ముందుకు పంపింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఈ నెల23న డీ వాటరింగ్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఐదు రోజులు గడుస్తున్నా ఇక్కడ పెద్దగా ఫలితం కనిపించడం లేదు. డీ వాటరింగ్‌‌‌‌‌‌‌‌కు ఆటంకాలు ఎదురవుతున్నట్లు ఇంజినీర్లు చెప్పుకుంటున్నారు. ఎన్ని నీళ్లు ఎత్తిపోసినా నీళ్లు మళ్లీ పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌లోకి వస్తుడడంతో తలపట్టుకుంటున్నారు. ఇక్కడ హెడ్‌‌‌‌‌‌‌‌ రెగ్యులరేటర్‌‌‌‌‌‌‌‌ గేట్లు దెబ్బతినడం వల్ల..గోదావరిలో ఇంకా 7 లక్షల క్యుసెక్కుల ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లో ఉండటం మూలంగా వాటర్‌‌‌‌‌‌‌‌ ఫోర్‌‌‌‌‌‌‌‌బే లోకి వస్తోందని తెలుస్తోంది. ఇప్పటికీ ఇక్కడ రెండు ఫ్లోర్‌‌‌‌లు బయటపడినప్పటికీ కంప్యూటర్లు, ఎల్ఈడీ టీవీలు, ఎలక్ట్రికల్ పరికరాలు కరాబయ్యాయి. రూముల నిండా బురదే కనిపిస్తోంది. లేబర్‌‌‌‌‌‌‌‌తో రెండు అడుగుల మేర ఏర్పడిన బురద మట్టిని తీయిస్తున్నారు.  కాగా, నీటిని ఎంత తోడిన గోడల నుంచి పంపు హౌజ్​లోకి నీళ్లు వస్తున్నాయని గజఈతగాళ్లు ఆఫీసర్లతో చెప్పినట్లు తెలిసింది.  

కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌  సంస్థదే పెత్తనం

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ పేరుకే గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ ది అయినా పెత్తనం అంతా మేఘా కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ సంస్థదే. వీరు పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌లలో పనిచేస్తున్న లేబర్లను ఫోన్లు తీసుకురాకుండా అడ్డుకుంటున్నారు. ఇంజినీర్లను కూడా ఫొటోలు తీసి పంపొద్దని హెచ్చరించారు. అన్నారం మోటార్లు బయటపడిన విషయాన్ని మీడియా సంస్థలన్నింటికీ తెలియచేయాల్సిన ఆఫీసర్లు, కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ సంస్థ ఆ పని చేయలేదు. కన్నెపల్లి పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌ దగ్గర జరుగుతున్న పని విషయాలను మీడియాకు తెలియకుండా గోప్యత పాటిస్తున్నారు. ఎలాంటి సమాచారం లీకయినా వేటు తప్పదని  సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చినట్లు లోకల్‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్లను కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ సంస్థ బెదిరిస్తోందని చెప్పుకుంటున్నారు.