50 వేల కొలువులు  ఎటుపాయె?

50 వేల కొలువులు  ఎటుపాయె?
  • భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించి ఏడు నెలలాయె
  • గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దీన్నే ప్రచారం చేసిన టీఆర్​ఎస్​
  • ఇప్పటికీ నోటిఫికేషన్లకు అతీగతీ లేదు 
  • ఏజ్ బార్ అవుతుండడంతో నిరుద్యోగుల్లో ఆందోళన


రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50 వేల పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేస్తం. వేల సంఖ్యలో టీచర్​, పోలీస్​  రిక్రూట్​మెంట్ జరగాల్సి ఉంది. ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలని సీఎస్​ను ఆదేశిస్తున్నం. ఇంకా ఏఏ శాఖల్లో ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలి. అలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్లు ఇయ్యాలి.  
 - నిరుడు డిసెంబర్ 13న సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఇది.

 
హైదరాబాద్, వెలుగు: ‘త్వరలోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం’ అని సీఎం కేసీఆర్ ​ప్రకటించి ఏడు నెలలైతున్నా అతీగతీ లేదు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలపై క్లారిటీ వచ్చినా.. జోనల్ వ్యవస్థ కు కేంద్రం ఆమోద ముద్ర వేసినా.. రాష్ట్ర సర్కార్ మాత్రం కొలువుల నోటిఫికేషన్లు విడుదల చేస్తలేదు. మూడేండ్లుగా ఎలాంటి జాబ్ నోటిఫికేషన్లు లేకపోవడంతో ఇప్పటికే లక్షలాది మంది నిరుద్యోగులకు ఏజ్ బార్  అవ్వగా, మరెందరో ఏజ్​బార్​కు దగ్గర్లో ఉన్నారు. మూడేండ్లకు ముందు కూడా అప్పుడప్పుడు అది కూడా చిన్నాచితక నోటిఫికేషన్లు తప్ప పెద్ద నోటిఫికేషన్లు ఏమీ లేవని, ఇలా ప్రభుత్వం ఏండ్లకేండ్లు జాప్యం చేస్తే తాము చదివిన చదువులకు అర్థం లేకుండా పోతుందని 
నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
1.91 లక్షల ఖాళీలుంటే 50 వేలకే అంగీకారం
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 39 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సీఆర్‌ బిశ్వాల్‌ నేతృత్వంలోని పీఆర్సీ తన నివేదికలో వెల్లడించిన విషయం తెలిసిందే. మొత్తం 4,91,304 పోస్టులు శాంక్షన్డ్  స్ట్రెంత్​ కాగా, ప్రస్తుతం 3,00,178 మంది మాత్రమే పనిచేస్తున్నట్లు ఆ కమిటీ తేల్చింది. ఇంకా 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని రిపోర్టులో వెల్లడించింది. విద్యాశాఖలో 23,798 పోస్టులు, హోం శాఖలో 37,182, హెల్త్ డిపార్ట్ మెంట్​లో 30,570, రెవెన్యూశాఖలో 7,961, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 12,628 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వివరించింది. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం 50 వేల ఉద్యోగాల భర్తీకే ముందుకొచ్చింది. అయితే.. ఆ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి ఏడు నెలలవుతున్నా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. ప్రభుత్వం గుర్తించిన 50 వేల పోస్టుల్లో సుమారు 16 వేల టీచర్ పోస్టులు, 19,910 పోలీస్ ఉద్యోగాలు ఉండగా.. బీసీ వెల్ఫేర్ లో 1,027, మున్సిపల్ లో 1,533, పశుసంవర్థక శాఖలో 1,500, వ్యవసాయ శాఖలో 1,740, ఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖల్లో 350, ఇతర శాఖల్లో మూడు వేల నుంచి నాలుగు వేల పోస్టులు ఉన్నట్లు తెలిసింది.  


జోనల్ వ్యవస్థకు ఇంకా ఆమోద ముద్ర పడకపోవడం వల్లే నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని సర్కారు తప్పించుకునే ప్రయత్నం చేసింది. జోనల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు ఏప్రిల్ 20న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. దీంతో జోనల్ అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోయాయి. గెజిట్ విడుదలై  రెండున్నర నెలలవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదు. కేవలం 151 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదల చేసి చేతులు దులుపుకుంది. 
ఏజ్ బార్ అవుతున్న నిరుద్యోగులు
రాష్ట్రంలో గత మూడేండ్లలో పోలీస్, టీచర్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ కాలేదు. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకుని లైబ్రరీల్లో, యూనివర్సిటీల్లో, కోచింగ్ సెంటర్లలో ఏండ్ల తరబడి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల్లో చాలా మంది గడిచిన మూడేండ్లలో ఏజ్ బార్ కు దగ్గరయ్యారు. గత పరీక్షల్లో దగ్గరి వరకు వచ్చి జాబ్ మిస్ అయినోళ్లు లాస్ట్ అటెంప్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో పని చేసిన తాము విలువైన టైంను కోల్పోయామని, జాబ్ నోటిఫికేషన్లలో తమకు వయోపరిమితి పెంచాలని విద్యార్థి ఉద్యమకారులు డిమాండ్ చేయడంతో పదేండ్ల సడలింపు ఇస్తూ 2015 ఆగస్టులో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఒక్క ఏడాది మాత్రమే ఈ సడలింపు వర్తిస్తుందని జీవోలో పేర్కొంది. అయితే ఆ సంవత్సరం పెద్దగా జాబ్ నోటిఫికేషన్లు రాకపోవడంతో మరో ఏడాది పొడిగించింది. ఆ తర్వాత కొన్ని జాబ్ నోటిఫికేషన్లు విడుదలైనా కోర్టు కేసులు, ఇతర కారణాలతో జాప్యం కావడంతో వయో పరిమితి సడలింపు నిర్ణయాన్ని ఇంకో ఏడాది పొడిగించింది. ఆ తర్వాత నిరుద్యోగుల డిమాండ్  మేరకు 2017 ఆగస్టు 8న ఏజ్ లిమిట్ పై జీవో నంబర్ 190 జారీ చేసింది. ఈ జీవో వ్యాలిడిటీ 2‌‌019, జూలై 26తో ముగిసింది. గత మూడేండ్లలో జాబ్ నోటిఫికేషన్లు జారీకాకపోవడంతో వయో పరిమితిని సడలించాలనే డిమాండ్ వస్తోంది. అయితే సీఎం కేసీఆరే స్వయంగా 50 వేల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించడం, ఇటీవల 151 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ లో వయో పరిమితి సడలింపు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఏజ్ లిమిట్ ను పెంచాలని, నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్​చేస్తున్నారు. 
నోటిఫికేషన్లు ఇచ్చే వరకు పోరాటం ఆగదు 
50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటిస్తే, లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని  నాగార్జునసాగర్​ బై ఎలక్షన్​ సమయంలో  కేటీఆర్ అన్నారు. కానీ నోటిఫికేషన్లు మాత్రం ఇప్పటి వరకు ఇవ్వలేదు. కేసీఆర్, కేటీఆర్ కు ఓట్లు, సీట్ల మీద ఉన్న శ్రద్ధ నిరుద్యోగులపై లేదు. జాబ్ నోటిఫికేషన్లు జారీ చేయాలని బీజేవైఎం ఆధ్వర్యంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దశలవారీ ఆందోళనలు ప్రారంభించాం. నోటిఫికేషన్లు వచ్చే వరకు మా పోరాటం, ఆందోళన ఆగదు.  
                                                                                                                                                                   - జి.మదన్ లాల్, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి