ఆర్టీసీ విలీనంపై జూన్ 2న ప్రకటన!

ఆర్టీసీ విలీనంపై జూన్ 2న ప్రకటన!
  • గతంలో అప్పటి ఎండీగా సజ్జనార్ పంపిన నివేదికను పరిశీలిస్తున్న సర్కారు 
  • యూనియన్ నేతలతో ఇటీవల సీఎం రేవంత్ భేటీ 
  • విలీనం గైడ్ లైన్స్ పై ఆర్టీసీ ఎండీకి వేర్వేరుగా యూనియన్ నేతల లేఖలు  
  • త్వరలోనే విలీన అధ్యయన కమిటీ నియామకం.. వారం, పది రోజుల్లో సర్కార్ కు ఫైనల్ రిపోర్టు  

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ విలీన శుభవార్తను రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజైన జూన్ 2 న ప్రభుత్వం నుంచి కార్మికులు వినబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో ఇటు ఆర్టీసీ యాజమాన్యం అటు రవాణా శాఖ అధికారులు బిజీ బిజీగా ఉన్నారు. 2023 చివర్లో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు అప్పటి బీఆర్ఎస్ సర్కార్ విలీన ప్రకటన చేయగా.. విధివిధానాల నివేదికను ఆ నాడు ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ ప్రభుత్వానికి అందించారు. ఇప్పుడు ఆ నివేదికను ప్రభుత్వం పరిశీలిస్తున్నది.

ఈ నెల 1న ఆర్టీసీలోని అన్ని యూనియన్ల నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం.. ఎవరికి వారు వేర్వేరుగా విలీనంపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి లేఖలు అందించారు. వీటిని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఇవే కాకుండా త్వరలోనే విలీనంపై ప్రభుత్వం ఓ కమిటీని నియమించనుంది. ఆ కమిటీలో ప్రభుత్వం తరఫున అధికారులతో పాటు యూనియన్ నేతలకు ప్రాతినిధ్యం కల్పించనున్నారు. కమిటీ నియామకం జరిగిన వారం, పది రోజుల్లో విలీనానికి సంబంధించిన విధివిధానాలపై తుది నివేదిక ఇవ్వాల్సిందిగా ఆ కమిటీని ప్రభుత్వం కోరనుంది.

ఈ నెలాఖరులోపు దీనిపై ప్రభుత్వం అధ్యయనం చేసి తుది నిర్ణయానికి రానుంది. జూన్ 2న ఆర్టీసీ విలీనంపై ప్రకటన అనంతరం ఆర్టీసీ ఇక ప్రజా రవాణా శాఖగా మారనుంది. ఈ విలీనం ద్వారా 37 వేల 360 మంది ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఈ విలీనంతో ప్రభుత్వంపై ఏటా దాదాపుగా రూ. వెయ్యి కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. ఆర్టీసీ ఆస్తులు మాత్రం ఆ సంస్థ పరిధిలోనే ఉండనున్నాయి.