
హైదరాబాద్: రాష్ట్రంలో అవయవదానం చాలా తక్కువగా ఉందని.. ఈ సంఖ్య పెరగాలంటే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచించారు. నోవాటెల్ లో ఇండియన్ సొసైటీ ఫర్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ ప్లాంటేషన్ వార్షిక సదస్సు జరిగింది. రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి దాదాపు 350 మంది వైద్య నిపుణులు హాజరయ్యారు. అవయవదానం.. ట్రాన్స్ ప్లాంటేషన్ పై డాక్టర్లు చర్చించారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని సదస్సులో వక్తలు స్పష్టం చేశారు.
చాలా మందికి అవగాహన లేక అవయవదానం చేసేందుకు ముందుకు రావడం లేదని కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర్ రావు తెలిపారు. బ్రెయిన్ డెడ్ అయినప్పటికీ అవయవాలు పనిచేస్తాయని.. చాలామందికి ఈ విషయంపై అవగాహన లేక అవయవ దానానికి ముందుకు రావట్లేదన్నారు. దీనిపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారాయన. అవయవదానంతో గరిష్టంగా 12 నుంచి 13మందికి ప్రాణం పోసి పునర్జన్మ ప్రసాదించే అవకాశం ఉందని డాక్టర్.భాస్కర్ రావు తెలిపారు.
కరోనా ప్రభావంతో ఊపిరితిత్తుల మార్పిడి కామన్ అయిందని ఇండియన్ సొసైటీ ఫర్ హార్ట్ అండ్ లంగ్స్ ట్రాన్స్ ప్లాంటేషన్ అధ్యక్షుడు డాక్టర్ సందీప్ అత్తావర్ తెలిపారు. డాక్టర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేశంలో అవయవదానం తక్కువగానే ఉందని డాక్టర్ సందీప్ అత్తావర్ తెలిపారు.