
ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఓ యువతికి పెండ్లి కుదరగా ఆమె మూడు రోజుల కింద మరొకరితో వెళ్లిపోయింది. దీంతో అదే ముహుర్తానికి రెండో కూతురును ఇచ్చి చేసేందుకు తల్లిదండ్రులు, బంధువులు సిద్ధపడ్డారు. ఇంతలో ఆమె మైనర్ అని అధికారులకు తెలియడంతో అధికారులు వచ్చి పెండ్లి నిలిపివేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో జరిగింది.
సీడీపీవో ఉమారాణి. స్థానికుల వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన ఓ దంపతులకు ముగ్గురు కూతుళ్లు కాగా.. పెద్దమ్మాయికి పెండ్లి కుదిర్చారు. ఆమె పెండ్లికి ముందే ఇంట్లోంచి వెళ్లిపోయింది. దీంతో ఆ యువకుడికి రెండో కూతురును ఇచ్చి చేసేందుకు ఏర్పాటు చేశారు.
ఆమె వయస్సు 17 ఏండ్ల 7నెలలు కాగా.. ఈ విషయం అధికారులకు తెలిసింది. సీడీపీవో ఉమారాణి, సిబ్బంది అక్కడి చేరుకొని పెండ్లి నిలిపేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు తల్లిదండ్రులు, బంధువులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.