ప్రేమ జంటలే టార్గెట్.. కానిస్టేబుల్ అరాచకాలకు ఇంజనీరింగ్ విద్యార్థిని బలి

ప్రేమ జంటలే టార్గెట్.. కానిస్టేబుల్ అరాచకాలకు ఇంజనీరింగ్ విద్యార్థిని బలి

అతనో ఏఆర్ కానిస్టేబుల్.. కానీ డ్యూటీ కంటే ప్రేమ జంటలపై నిఘా పెట్టడమే అతని ముఖ్యమైన పని. ఒంటరిగా వచ్చే మహిళలు, ప్రేమ జంటల ఫోటోలు తీసి.. బెదిరించి వసూళ్లు చేస్తూ వాళ్ల జీవితాలతో ఆడుకోవడం సరదా. అందుకోసం ఓ అసిస్టెంట్ ను నియమించుకుని ఫోటోలు తీయించి అరాచకాలకు పాల్పడుతూ ఉన్నాడు. ఈ కానిస్టేబుల్ చేసిన పనికి ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని చనిపోవడం కడప జిల్లాలో సంచలనంగా మారింది. 

వివరాల్లోకి వెళ్తే.. కడప ఆర్మ్డ్ విభాగంలో కే రామ్మోహన్ రెడ్డి ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. పాలకొండలకు వచ్చే లవర్స్, ఒంటరిగా వచ్చే మహిళలను టార్గెట్ చేస్తూ వసూళ్లకు పాల్పడటం హాబీగా పెట్టుకున్నాడు. అందుకోసం తన సమీప బంధువైన ప్రొద్దుటూరుకు చెందిన అనిల్ కుమార్ రెడ్డిని అసిస్టెంట్ గా నియమించుకున్నాడు. 

పాలకొండలకు వచ్చే ఒంటరి మహిళలు, ప్రేమ జంటల ఫొటోలు తీయడం అనిల్ కుమార్ పనిగా పెట్టుకుని, భయపెట్టి వారి ఫోన్ నంబర్లు కూడా తీసుకుంటాడు. అలా అతడు వారి నుంచి సేకరించిన వివరాలను రామ్మోహన్ రెడ్డికి పంపిస్తాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ పాలకొండలకు వచ్చి పేరెంట్స్ కు చెబుతానని భయపెట్టి, అందిన వరకు డబ్బులు వసూలు చేసేవాడు.

►ALSO READ | ఆఫీస్ బాయ్ను చెప్పుతో కొట్టిన ఎక్సైజ్ సీఐ.. వీడియో వైరల్..

ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ బీటెక్ విద్యార్థిని, ఆమె స్నేహితులు పాలకొండలకు వెళ్లారు. వెంటనే అనిల్ వారి ఫొటోలు తీయగా, రామ్మోహన్ రెడ్డి వెళ్లి బెదిరించాడు. దాంతో విద్యార్థులు రూ.4వేలు ఇచ్చి అక్కడి నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత మళ్లీ బెదిరింపులకు దిగడంతో మరో రూ.10 వేలు ఇచ్చారు. ఇంకా డబ్బులు కావాలని వేధించడంతో యువతి ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది.

యువతి మృతి చెందినా అతడి బుద్ధి మారలేదు. ఆమె తండ్రికి ఫోన్ చేసి బెదిరించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. యువతి పేరెంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు రామ్మోహన్రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు అతడు పలువురిని బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో కానిస్టేబుల్ రామ్మోహన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కడప జిల్లా పోలీస్ అధికారి అశోక్ కుమార్.