చౌటుప్పల్, వెలుగు: తండ్రీ కూతురు వెళ్తున్న బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో కూతురు అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రికి తీవ్రగాయాలయ్యాయి. సీఐ మన్మధ కుమార్ తెలిపిన ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన వడ్డగోని రమేశ్ శనివారం తన కూతురు రిహాన్సిక(9)ను బైక్‌పై ఎక్కించుకుని చౌటుప్పల్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు.
లింగోజిగూడెం పరిధిలో వెనుక నుంచి లారీ కంటైనర్ ఢీకొట్టింది. తండ్రీ కూతురు రోడ్డుపై పడిపోగా, రిహాన్సికపై లారీ వెనుక టైర్లు వెళ్లడంతో స్పాట్లో మృతిచెందింది. రమేశ్‌కు తీవ్ర గాయాలు కావడంతో చౌటుప్పల్ ప్రభుత్వ దవాఖానలో ప్రథమ చికిత్స చేసి, హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.
కరెంట్ షాక్‌తో రైతు..
మెదక్: పొలంలోని వ్యవసాయ బోరుబావి వద్ద విద్యుత్ వైరు మరమ్మతు చేస్తుండగా షాక్ తగిలి రైతు మృతిచెందాడు. మెదక్ జిల్లా హవేలీ ఘనపురం మండలం కూచన్‌పల్లి గ్రామానికి చెందిన కుకుట్ల లచ్చయ్య(52) శనివారం తన పొలంలోని బోరుబావి వద్దకు వెళ్లాడు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో స్తంభం నుంచి స్టార్టర్ డబ్బాకు వెళ్లే వైర్‌ను పరిశీలిస్తుండగా షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు.
