కాంగ్రెస్‌‌ ఖాతాలోకి వడ్డేపల్లి!...ఆ పార్టీలో చేరనున్న ఆల్‌‌ ఇండియా ఫార్వార్డ్‌‌ బ్లాక్‌‌ కౌన్సిలర్లు!

కాంగ్రెస్‌‌ ఖాతాలోకి వడ్డేపల్లి!...ఆ పార్టీలో చేరనున్న ఆల్‌‌ ఇండియా ఫార్వార్డ్‌‌ బ్లాక్‌‌ కౌన్సిలర్లు!
  •     మంత్రి జూపల్లితో మంతనాలు
  •     సీఎం రేవంత్‌‌ రెడ్డితో భేటీ

గద్వాల/హైదరాబాద్, వెలుగు: గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ సైతం కాంగ్రెస్‌‌ ఖాతాలోకే వెళ్లనుంది. ఈ మున్సిపాలిటీలో ఆల్‌‌ ఇండియా ఫార్వార్డ్‌‌ బ్లాక్‌‌ (ఏఐఎఫ్‌‌బీ) నుంచి గెలుపొందిన 8మంది కౌన్సిలర్లు కాంగ్రెస్‌‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వారు ఏఐఎఫ్‌‌బీ నాయకుడు వడ్డేపల్లి శీనివాస్‌‌తో కలిసి శనివారం హైదరాబాద్‌‌లో మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు. 

మంత్రితో చర్చల అనంతరం జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కౌన్సిలర్ల వెంట మంత్రి జూపల్లితో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఎంపీ మల్లు రవి, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ ఉన్నారు. కాగా, సీఎంతో భేటీ అనంతరం ఆ ఎనిమిది మంది ఏఐఎఫ్‌‌బీ కౌన్సిలర్లు కాంగ్రెస్‌‌లో చేరడం దాదాపు ఖాయమైనట్టు తెలిసింది. చేరికల విషయాన్ని నేడో, రేపో అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. 

వడ్డేపల్లి మున్సిపాలిటీకి చెందిన మాజీ జడ్పీటీసీ వడ్డేపల్లి శ్రీనివాస్‌‌ ఎన్నికలకు ముందు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సమక్షంలో జాగృతిలో చేరారు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో 10 వార్డులు ఉండగా.. ఆల్‌‌ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌‌ తరఫున తొమ్మిది స్థానాల్లో పోటీ చేసి.. ఎనిమిది స్థానాల్లో గెలిచారు. కాగా..తాము కాంగ్రెస్ లో చేరడం లేదని, కేవలం మున్సిపల్ అభివృద్ధి కోసమే సీఎంను కలిశామని గెలిచినవారు చెప్పారు. కాంగ్రెస్ లో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.