
న్యూఢిల్లీ: భారత అమ్ములపొదిలోని బ్రహ్మోస్ మిస్సైల్ ముందు చైనా, పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏ మాత్రం సరితూగవు. ఈ మాట అన్నది ఏ భారతీయ వ్యక్తో కాదు. స్వయంగా అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఓ యుద్ధ నిపుణుడు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ చైనా, పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బ్రహ్మోస్ ముందు జుజూబీ అంటూ.. భారత మిస్సైల్ సామర్ధ్యాన్ని ఆయన ప్రశంసించడం చర్చనీయాంశంగా మారింది.
అమెరికాకు చెందిన కల్నల్ (రిటైర్డ్) జాన్ స్పెన్సర్ ఓ భారతీయ నేషనల్ మీడియా ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పహల్గాం టెర్రర్ ఎటాక్, ఆపరేషన్ సిందూర్, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణమాలపై మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్‌లో ఎప్పుడైనా, ఎక్కడైనా దాడి చేయగలమనే బలమైన సందేశాన్ని ఇండియా పంపిందన్నారు. పాక్‌తో ఉద్రిక్తతల వేళ డిఫెన్స్ అండ్ అటాక్‌లో భారత్ స్పష్టమైన ఆధిపత్యం కనబర్చిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ALSO READ | ఆపరేషన్ సిందూర్ సక్సెస్ తో ఇండియన్ ఆర్మీకి రూ. 50 వేలు కోట్లు..
పాకిస్తాన్ ఉపయోగించే చైనా వైమానిక రక్షణ వ్యవస్థలు, భారత బ్రహ్మోస్ క్షిపణులకు సరితూగవని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలు, సైనిక స్థావరాలపై దాడులకు కోసం భారత్ ఈ మిస్సైల్ ఉపయోగించిదని.. కానీ వాటిని అడ్డుకోవడంలో పాక్, చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చేతులేత్తేసిందని పేర్కొన్నారు. ఒకే సమయంలో పాకిస్తాన్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో దాడి చేయడం.. అలాగే పాకిస్తాన్ డ్రోన్ దాడులు, హై-స్పీడ్ క్షిపణులను ఎదుర్కోవడంలో భారత్ విజయవంతమైందని ప్రశంసించారు.
‘‘చైనా వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణులు భారతదేశ వ్యవస్థలతో పోలిస్తే తక్కువ సామర్థ్యం కలిగి ఉన్నాయి. భారత బ్రహ్మోస్ క్షిపణి చైనా, పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థలను ఛేదించింది. పాకిస్తాన్‌లోని ఏ ప్రదేశంలోనైనా ఎప్పుడైనా దాడి చేయగలమనే భారత్ సందేశం స్పష్టంగా ఉంది’’ అని స్పెన్సర్ పేర్కొన్నారు.పాకిస్తాన్ ఉపయోగించే చైనా వైమానిక రక్షణ వ్యవస్థల్లోకి బ్రహ్మోస్ క్షిపణి చొచ్చుకుపోయే సామర్థ్యం భారతదేశ అధునాతన సైనిక సామర్థ్యాలకు నిదర్శనమని ఆయన గుర్తు చేశారు.
పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్‌కు కౌంటర్ గా ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులను హతం చేసింది. ఆపరేషన్ సిందూర్ కు ప్రతీకారంగా పాక్ భారత్ పై దాడులకు ప్రయత్నించింది. చైనా, టర్కీకి చెందిన డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు ప్రయత్నించింది. పాక్ దాడులకు భారత సైన్యం ఎక్కడికక్కడ సమర్ధవంతంగా ఎదుర్కొంది. ఇదే సమయంలో పాక్ ధీటుగా కౌంటర్ ఎటాక్ చేసింది. పాక్ చైనా నుంచి తెచ్చుకున్న గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో డ్రోన్లు, మిస్సైళ్లలతో దాడులు చేసి దాయాది దేశానికి తగిన బుద్ధి చెప్పింది.