పాకిస్తాన్ జైలులో కొట్టలేదు కానీ.. మెంటల్ టార్చర్ పెట్టారు..

పాకిస్తాన్ జైలులో కొట్టలేదు కానీ.. మెంటల్ టార్చర్ పెట్టారు..

ఇండియా సరిహద్దులు దాటి.. పాకిస్తాన్ లోకి పొరపాటున వెళ్లిన భారత్ జవాన్ పూర్ణమ్ కుమార్ షా.. తిరిగి ఇండియా వచ్చిన సంగతి తెలిసిందే. మే 14న ఇండియాకు అప్పగించింది పాక్. అతన్ని నేరుగా ఆర్మీ క్వార్టర్స్ కు తీసుకెళ్లిన మన సైన్యం.. అక్కడ విచారణ చేసింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ జైలులోని తన అనుభవాన్ని వివరించాడు పూర్ణమ్ కుమార్ షా.

పాకిస్తాన్ జైలులో పెట్టారని.. శారీరకంగా హింసించలేదని.. కొట్టలేదని చెప్పాడు. అయితే మానసిక హింసకు గురి చేసినట్లు వెల్లడించాడు కుమార్ షా. కనీసం నిద్ర కూడా సరిగా పోనిచ్చేవారు కాదని.. బాత్రూంకు వెళ్లాలన్నా అనుమతి ఇచ్చేవారు కాదని చెప్పుకొచ్చాడు. గంటలు గంటలు విచారణ చేసేవారని.. పాకిస్తాన్ దేశంలోకి ఎందుకొచ్చావ్ అంటూ పదేపదే ప్రశ్నించేవారని వివరించాడు కుమార్ షా. ఇండియా ఏం చేస్తుంది.. ఎలాంటి చర్యలు తీసుకుంటుంది.. పాకిస్తాన్ పై సైనిక చర్యకు దిగుతుందా వంటి ప్రశ్నలతో విచారణ చేసినట్లు భారత ఆర్మీ అధికారులకు వివరించాడు కుమార్ షా. 

మూడు వారాలు పాకిస్తాన్ జైలులో ఉన్న కుమార్ షాను.. మానసికంగా వేధించారని.. భారత సైన్యం రహస్యాలు చెప్పాలంటూ గుచ్చిగుచ్చి ప్రశ్నించేవారని భారత్ ఆర్మీ స్పష్టం చేసింది. రాత్రి సమయాల్లోనూ నిద్రపోనివ్వకుండా విచారణ పేరుతో.. గంటలు గంటలు నిర్బంధించేవారని వెల్లడించింది ఆర్మీ. 

ఇండియా, పాకిస్తాన్ దౌత్య చర్చల్లో భాగంగా.. పూర్ణమ్ కుమార్ షాను.. మే 14వ తేదీన ఇండియాకు అప్పగించింది పాకిస్తాన్. విడుదల అయిన కుమార్ షా ఆరోగ్యం బాగానే ఉందని.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని స్పష్టం చేశారు ఆర్మీ డాక్టర్లు. నిద్ర లేకపోవటం వల్ల కళ్లు నల్లబడ్డాయని.. మానసిక హింసతో శారీరకంగా వీక్ అయ్యాడని వెల్లడించారు. 

అతను ఎదుర్కొన్న మానసిక హింస నుంచి బయటపడటానికి కొంత సమయం పడుతుందని స్పష్టం చేసింది ఇండియన్ ఆర్మీ.