ప్రపంచ BP డే: హై బీపీని ఎలా ఎదుర్కోవాలి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ.. బీపీ ఎందుకొస్తుంది..?

ప్రపంచ BP డే: హై బీపీని ఎలా ఎదుర్కోవాలి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ.. బీపీ ఎందుకొస్తుంది..?

వేగంగా మారుతోన్న జీవన శైలి కారణంగా మ‌న శరీరం అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. చాలా మంది ఉద్యోగం, వ్యాపారం, ఇతర పనుల్లో నిమగ్నమై ఆరోగ్యంపై దృష్టి సారించడం లేదు. తద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా షుగర్, బీపీ, హైపర్‎టెన్షన్ (అధిక రక్తపోటు) వంటి వ్యాధులతో ఏజ్‎తో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పండు ముసలి వారిపై ఎటాక్ చేస్తున్నాయి. ఇందులో అధిక రక్తపోటు ప్రజలను ఎక్కువగా వెంటాడుతోన్న వ్యాధులలో ఒకటి. అయితే.. అధిక రక్తపోటుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా మే 17న వరల్డ్ హైపర్ టెన్షన్ డే జరుపుతారు. ఈ సందర్భంగా హెపర్ టెన్షన్ ప్రభావం, దానికి తీసుకోవాల్సిన చికిత్స వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు.

2025 వరల్డ్ హైపర్ టెన్షన్ డే..

‘మీ బీపీని వెంటనే చెక్ చేసుకోండి. కంట్రోల్​ చేయండి. ఎక్కువకాలం బతకండి’ ఇదే 2025 హైపర్ టెన్షన్ డే థీమ్. ప్రస్తుతం ఎవ్వరిని చూసినా బిజీ లైఫ్​ అయిపోయింది. ప్రతి ఒక్కరూ కాలంతో పరుగెడుతూనే ఉన్నారు. వాళ్లూ వీళ్లూ అనే తేడా లేకుండా.. అందరూ ఏదో ఒక ఒత్తిడికి గురవుతున్నారు. తద్వారా హెల్దీ డైట్ మెయింటెయిన్ చేయట్లేదు.. నిద్ర సరిపోవడం లేదు. దానికితోడు ఒత్తిడి నుంచి ఉపశమనం కోసమంటూ స్మోకింగ్, డ్రింకింగ్​ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల వల్ల ఎప్పుడో రావాల్సిన రోగాలు.. కాస్త ముందుగానే వచ్చేస్తున్నాయి. వాటిలో ఈ హైపర్ టెన్షన్​ ఒకటి. బీపీ అని పిలుస్తుంటాం కదా అదే. 

శ్రద్ధ తీసుకోవాలి

సాధారణంగా బీపీ120/80 ఉంటే నార్మల్‎గా ఉన్నట్టు అని అర్థం.130 –135 వరకు ఉన్నా పెద్దగా డేంజర్ లేదు. అదే140/90 ఉంటే మాత్రం ప్రమాదకరం. అందుకని మాటిమాటికీ హాస్పిటల్‎కి వెళ్లి బీపీ చెక్​ చేయించుకోమని కాదు.. కానీ, ఈ రోజుల్లో హెల్త్​ గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటే అంత మేలు. ఇప్పుడు డిజిటల్ వాచ్‎లు, స్మార్ట్​ ఫోన్​లో యాప్‎లు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి టెక్నాలజీని కూడా వాడుకోవాలి. ఏదైనా తేడాగా అనిపిస్తే.. వెంటనే డాక్టర్ దగ్గరకి వెళ్లి చెకప్ చేయించుకోవాలి. డాక్టర్ సూచనల మేరకు తగు జాగ్రత్తలు పాటించాలి. 

ఈ లక్షణాలు ఉంటే.. 

నార్మల్​గా ఉన్న వ్యక్తిలో కూడా బ్లడ్ ప్రెజర్ అబ్​నార్మల్​గా కనిపించడం, లోపలి అవయవాల మీద ఒత్తిడి పెరగడం వంటి పరిస్థితులు కనుగొన్నారు. అందువల్ల బీపీని సైలెంట్​ డిసీజ్​ అంటారు. కాకపోతే కొన్ని లక్షణాలను బట్టి బీపీ చెక్​ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటంటే... తల దిమ్ముగా అయిపోవడం, ఏకాగ్రత లేకపోవడం, గుండె దడగా అనిపించడం, కాళ్లలో వాపులు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నిద్ర పట్టకపోవడం వంటివన్నీ బీపీ లక్షణాలు. ఇలాంటివి కనిపించినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. 

అలవాట్లు మార్చుకుంటే చాలు

గతంలో ప్రమాదరకమైన జబ్బులుగా చూసేవి ఇప్పుడు చాలా కామన్​ అయిపోయాయి. వాటిలో హైపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెన్షన్, డయాబెటిస్, మానసిక ఒత్తిడి వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. యూత్​ ఎక్కువగా హైపర్ టెన్షన్​బారిన పడుతున్నారు. దాని వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది కూడా వాళ్లే. దానికి కారణం వాళ్లకున్న అలవాట్లు. ప్రాబ్లమ్ ఉందని తెలిసినా కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదానికి దారితీస్తుంది. ముఖ్యంగా నిద్ర లేకపోవడం, మానసిక ఒత్తిళ్లు పెరగడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కాబ్టటి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు. 

ఆ రెండే..

బీపీ సాధారణ స్థాయిలు మించిపోవడానికి, తిరిగి కంట్రోల్ కాకపోవడానికి ముఖ్యకారణాలు రెండు. అవే స్మోకింగ్, డ్రింకింగ్. వీటివల్లే బీపీ పేషెంట్లు పెరిగిపోతున్నారు. యువతలో ఎక్కువగా ఈ కేసులు బయటపడడానికి కూడా ఈ రెండు కారణాలు కీలకంగా కనిపిస్తున్నాయి. 

బీపీ మానిటరింగ్

హైపర్ టెన్షన్ ఉన్న వ్యక్తికి దాని సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. వాటిలో గుండె సంబంధిత వ్యాధులు, బ్రెయిన్​ స్ట్రోక్, మెదడు పనితీరు లోపించడం, కిడ్నీ, కంటి సమస్యలు వంటివి రావొచ్చు. ప్రస్తుతం 24 గంటలు బీపీ మానిటరింగ్ చేసే ఎక్విప్​మెంట్​అందుబాటులోకి వచ్చింది. బీపీ పేషెంట్​ వస్తే వాళ్లలో ప్రెజర్ ఏ లెవల్​లో​ ఉంది? ఎంత కంట్రోల్​లో ఉంటుంది? మెడిసిన్ వాడాక జరిగిన బెనిఫిట్స్​ ఏంటి? రావాల్సిన లెవల్స్​కి వస్తున్నాయా? లేదా? అనేది మానిటరింగ్ ద్వారానే తెలుస్తుంది.  

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

భోజనంలో ఉప్పు తగ్గించడంతో పాటు ఉప్పు ఎక్కువ ఉండే ఫాస్ట్​ఫుడ్, పచ్చళ్లు, శ్నాక్స్ వంటివి తినొద్దు. సోడియం, క్లోరిన్ ఉండని పింక్​ సాల్ట్​ తినాలి. సోడియం లేని ఉప్పు తింటే మంచిది. బరువు, ఒబెసిటీని కంట్రోల్​లో ఉంచుకోవాలి. కాల్షియం, పొటాషియం ఉండే పాలు, పాల పదార్థాలు, పండ్లు ఎక్కువ తినాలి. ఎనిమిది గంటలు నిద్రపోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్ వంటివి మానేయాలి. 

ALSO READ | Good Health : పొద్దున్నే ఇది తాగండి.. ఇట్టే బరువు తగ్గుతారు..

రక్తపోటును తగ్గించడానికి, కంట్రోల్‎లో ఉంచడానికి ఆయుర్వేద మూలికలు పని చేస్తాయి. బ్రాహ్మి, అశ్వగంధ, జటమాంసి, తులసి, అర్జున, త్రిఫల, ఆమ్ల, జీర, సర్పగంధ వంటి మూలికలు వ్యాధిని నివారిస్తాయి. ఇవి ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి, మిమ్మల్ని విశ్రాంతి తీసుకోవడానికి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. అధిక రక్తపోటును కంట్రోల్ లో ఉంచడంలో బాడీ వెయిట్ కూడా కీలకం. 

అలాగే.. రక్త ప్రవాహాన్ని సరిగ్గా ఉంచడానికి, గుండె ఆరోగ్య వంతంగా ఉండటానికి వ్యాయామం, యోగా, ధ్యానం ఒక గొప్ప మార్గం. మంచి నిద్ర తప్పనిసరి. పాలకూర, అరటిపండు, కొబ్బరి నీరు వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా హైపర్ టెన్షన్ ను నియంత్రణలో ఉంచవచ్చు. నెయ్యి, కోల్డ్-ప్రెస్డ్ బాదం నూనె వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు మంచివి.