సినీ ఇండస్ట్రీలో సంస్కరణలు అవసరం.. ఏం కావాలో కొత్త పుస్తకం రాసుకుందాం: సీఎం రేవంత్

సినీ ఇండస్ట్రీలో సంస్కరణలు అవసరం.. ఏం కావాలో కొత్త పుస్తకం రాసుకుందాం: సీఎం రేవంత్

హైదరాబాద్: సినీ ఇండస్ట్రీలో సంస్కరణలు అవసరమని, చిత్ర పరిశ్రమకు ఏం అవసరమో కొత్త పుస్తకం రాసుకుందామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదివారం (ఆగస్ట్ 24) పలువురు టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‎లోని ఆయన నివాసంలో కలిశారు. సినీ కార్మికుల సమ్మె పరిష్కారానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగుండాలన్నారు.

ఇందుకోసం త్వరలో సినీ కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతానని అన్నారు. ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుందని, పరిశ్రమలోకి కొత్తగా వచ్చేవారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  నైపుణ్యాల పెంపు కోసం ఒక కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మి్స్తోన్న స్కిల్‌ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని.. ఇలాంటి సమయంలో ఇండస్ట్రీలో వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించానని పేర్కొన్నారు. నిర్మాతలు, కార్మికుల అంశంలో సంస్కరణలు అవసరమని అన్నారు.

 కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని కోరారు. నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి ఒక పాలసీ తెస్తే బాగుంటుందని, సినీ పరిశ్రమకు మానిటరింగ్ అవసరమని పేర్కొన్నారు. సినీ ఇండస్ట్రీలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదని అందరూ చట్ట పరిధిలో పని చేయాల్సిందేనని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. 

మూవీ ఇండస్ట్రీ విషయంలో తాను న్యూట్రల్‎గా ఉంటానని స్పష్టం చేశారు. హైదరాబాద్‎లో అంతర్జాతీయ సినీ చిత్రీకరణ కూడా జరుగుతోందని.. అలాగే తెలుగు సినిమా షూటింగులు కూడా ఎక్కువగా రాష్ట్రంలోనే జరిగేలా చూడాలని నిర్మాతలకు సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినీ పరిశ్రమను ఉంచడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.


►ALSO READ | వామ్మో.. జగిత్యాల జిల్లాలో సండే రోజు.. మేక మాంసం కొన్నోళ్ల పరిస్థితి ఇది..!