
జగిత్యాల: జగిత్యాల జిల్లాలో అనారోగ్యంతో చచ్చిపోయిన మేక మాంసం అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన ఘటన వెలుగులోకి వచ్చింది. జనాలు ఆ విషయం తెలియక ఆదివారం కావడంతో మటన్ కొనుక్కుని వెళ్లారు. వండేటప్పుడు స్మెల్ రావడంతో విషయం బయటకొచ్చింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్ష కొండ గ్రామంలో అనారోగ్యంతో చనిపోయిన మేకను కోసి అమ్మిన విక్రయదారులుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వండేటప్పుడు స్మెల్ రావడంతో అనుమానం వచ్చి గ్రామ కమిటీకి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. విక్రయదారుడిని నిలదీసి పోలీసులకు గ్రామ కమిటీ సభ్యులు ఫిర్యాదు చేశారు.
గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో చనిపోయిన మేక మాంసాన్ని పోలీసులు బయట పారవేయించారు. ఆదివారం ఉదయం ఈ ఘటన జరగగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఆదివారం సాయంత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో.. కోరుట్ల ప్రాంతంలోని గ్రామాలలో మాంసం కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ గ్రామ కమిటీలు డప్పు చాటింపు వేయించాయి. బయట హోటల్స్లో మటన్ బిర్యానీ తినడానికి భయపడి సండే గింత మటన్ తెచ్చుకుని వండుకుని తిందామంటే మరీ ఇంత దారుణంగా అనారోగ్యంతో చనిపోయిన మేక మాంసం అమ్మడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మటన్ అమ్మకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ఎలాంటి రూల్స్ పాటించకపోగా.. మటన్ కూడా క్వాలిటీ ఉండడం లేదు. మాంసం అమ్మకాలపై దృష్టి పెట్టాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో మటన్ సెంటర్యజమానులు ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు. కోసే మేకలు, గొర్రెలు ఆరోగ్యంగా ఉన్నాయో లేదోనని నిర్ధారించాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. వెటర్నరీ అధికారులు మటన్క్వాలిటీని నిర్ధారిస్తే.. మున్సిపల్అధికారులు స్టాంపింగ్చేయాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో ప్రతిరోజూ 3వేల నుంచి 5వేల వరకు వరకు జీవాలను కట్ చేస్తుండగా.. ఆదివారం ఆ సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఇక పండగ రోజుల్లో అయితే లక్షల్లో ఉంటుందని అధికారుల అంచనా.
దాదాపు 90 శాతం మేకలు, గొర్రెలు వధశాలల్లో కాకుండా బయటే కోయిస్తున్నారు. వాటికి ఎలాంటి పరీక్షలు నిర్వహించడం లేదు. ఈక్రమంలో అనారోగ్యంగా ఉన్నవి.. చనిపోయినవాటిని కోసి అమ్ముతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి మటన్ తింటే అనారోగ్యం బారినపడే అవకాశం ఉంది. ఇక గ్రామాల్లో అయితే మటన్ మార్కెట్లు లేకపోవడంతో దుమ్ము, ధూలి ఉన్న చోట కూడా అమ్మకాలు జరుగుతున్నాయి.