డిఫెన్స్ బడ్జెట్ 7 లక్షల కోట్లు: ఆపరేషన్ సింధూర్ తర్వాత లక్ష కోట్లు పెంపు.. కానీ కుప్పకూలిన స్టాక్స్

డిఫెన్స్ బడ్జెట్ 7 లక్షల కోట్లు: ఆపరేషన్ సింధూర్ తర్వాత లక్ష కోట్లు పెంపు.. కానీ కుప్పకూలిన స్టాక్స్

కేంద్ర బడ్జెట్ 2026లో రక్షణ రంగానికి ఆర్థిక మంత్రి ఊహించని విధంగా భారీ కేటాయింపులు చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.6లక్షల 81వేల కోట్లుగా ఉన్న రక్షణ బడ్జెట్‌ను.. ఈసారి ఏకంగా రూ.7లక్షల 85వేల కోట్లకు పెంచారు. అంటే గతేడాదితో పోలిస్తే రక్షణ వ్యయం 15 శాతం పెరిగింది. సాధారణంగా నిధుల కేటాయింపు పెరిగితే ఆ రంగంలోని కంపెనీల షేర్లు పెరగాలి. కానీ విచిత్రంగా ఆదివారం స్పెషల్ బడ్జెట్ ట్రేడింగ్ సెషన్‌లో డిఫెన్స్ స్టాక్స్ భారీగా కుప్పకూలాయి. నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఏకంగా 8.86 శాతం పడిపోయి అందరినీ షాక్ కి గురిచేసింది

రక్షణ రంగానికి 15 శాతం నిధులు పెంచినప్పటికీ.. మార్కెట్ నిపుణులు, ఇన్వెస్టర్లు మాత్రం అంతకంటే ఎక్కువ ఆశించటమే పతనానికి కారణంగా తెలుస్తోంది. అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చితుల వేళ బడ్జెట్ కేటాయింపుల్లో కనీసం 20 నుండి 25 శాతం వృద్ధి ఉంటుందని మార్కెట్ వర్గాలు బలంగా నమ్మాయి. ముఖ్యంగా డ్రోన్లు, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ వంటి హై-టెక్ రంగాల్లో దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీగా నిధులు గుమ్మరిస్తుందని భావించారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన 15 శాతం పెంపు ఇన్వెస్టర్ల అంచనాలను అందుకోలేకపోయింది. ఊహించిన దానికంటే తక్కువ కేటాయింపులు రావడం ఇన్వెస్టర్లలో నిరాశ నింపింది, అందుకే అమ్మకాల ఒత్తిడి పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

►ALSO READ | బడ్జెట్ 2026 తర్వాత ఏఏ వస్తువులపై దిగుమతి సుంకం సున్నా అయ్యిందో తెలుసా..?

నిఫ్టీ డిఫెన్స్ ఇండెక్స్‌లోని 18 షేర్లలో 16 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అత్యధికంగా భారత్ డైనమిక్స్ షేరు దాదాపు 9 శాతం పతనమై టాప్ లూజర్‌గా నిలిచింది. వీటితో పాటు గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్, పారస్ డిఫెన్స్, మజగాన్ డాక్, మిధాని, కొచ్చిన్ షిప్‌యార్డ్, భారత్ ఎలక్ట్రానిక్స్ కంపెనీల షేర్లు 4 నుండి 7 శాతం మేర క్షీణించాయి. మధ్యాహ్నం 2:46 గంటల సమయానికి నిఫ్టీ50 ఇండెక్స్ 1.12 శాతం తగ్గితే, డిఫెన్స్ ఇండెక్స్ మాత్రం 3.76 శాతం నష్టంతో మార్కెట్ కంటే దారుణంగా వెనుకబడింది.

రక్షణ రంగంలో కేవలం నిధుల కేటాయింపు కంటే.. దీర్ఘకాలిక ఆర్డర్లు.. కాంట్రాక్టింగ్ ప్రక్రియ వేగవంతం కావడం ఇన్వెస్టర్లకు ముఖ్యం. స్వదేశీ తయారీని ప్రోత్సహించడం, R&Dకి సపోర్ట్ పెంచటం వల్ల భవిష్యత్తులో ఈ కంపెనీల మార్జిన్లు మెరుగుపడతాయని నిపుణులు భావిస్తున్నారు. ఏఐ, రోబోటిక్స్, అంతరిక్ష పరిశోధనల వంటి అత్యాధునిక సాంకేతిక రంగాల్లో కేటాయింపులు ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి స్టాక్స్ పడిపోయినప్పటికీ.. దీర్ఘకాలికంగా ఆర్డర్ విజిబిలిటీ బాగుంటే తిరిగి పుంజుకునే అవకాశాలు ఎక్కువంటున్నారు విశ్లేషకులు.