
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ పోరు నడుస్తోందని.. ఆ పార్టీ మూడు ముక్కలుగా చీలిపోయిందని అన్నారు. బీఆర్ఎస్ ను నాలుగు ముక్కలు చేయాలని మరో వ్యక్తి చూస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు.
బీఆర్ఎస్ పని అయిపోయిందని.. ఆ పార్టీ రాష్ట్రంలో ఎక్కడ లేదన్నారు. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఉండదన్నారు. రాష్ట్రంలో అక్కడక్కడ ఉన్నది ఆ మతపిచ్చి పార్టీ బీజేపీ మాత్రమేనని అన్నారు. ఎవడు తప్పు చేసినా ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరించారు.
ఆదివారం ( ఆగస్టు 24 ) కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలో రెండో విడత జనహిత పాదయాత్ర ప్రారంభించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ పాదయాత్రలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. మన భవిష్యత్ కోసమే ఈ జనహిత పాదయాత్ర అని.. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికే ఈ పాదయాత్ర చేపట్టామని తెలిపారు.