సిక్కుల ఆఖరి గురువు .. గురు గోవింద సింగ్ .. ఆయన చరిత్ర ఇదే..!

సిక్కుల ఆఖరి గురువు  .. గురు గోవింద సింగ్ .. ఆయన చరిత్ర ఇదే..!

బిహార్​లోని పాట్నాలో పుట్టిన గురు గోవింద్ సింగ్.. సిక్కు గురువుల్లో ఆఖరివాడు. గోవింద్ తండ్రి గురు తేజ్ బహదూర్​ సింగ్ ఒక టైంలో పంజాబ్​లోని ప్రభుత్వ అధికారులతోనూ విభేదించాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును ధిక్కరించంతో చక్రవర్తి తేజ్​ను1675లో ఉరి తీశాడు. దాంతో పదిహేనేండ్లకే గోవింద్ గురు పీఠాన్ని అధిరోహించాల్సి వచ్చింది. అయితే ఇంత చిన్న కుర్రాడిని మొఘల్​ల శత్రుత్వానికి గురిచేయడం మంచిది కాదని, అతన్ని హిమాలయ పర్వత సాధువుల దగ్గర ‘గురు’ స్థాపించిన ఆనంద్​పూర్​ గ్రామానికి పంపారు. దాదాపు 20 ఏండ్లు ఆయన అక్కడి ఆశ్రమంలోనే నివసించాడు. జాతి భావాన్ని, సంప్రదాయాలను అవగాహన చేసుకున్నాడు. 

సిక్కులను క్రమశిక్షణతో, ఏకీకృతంగా ఉంచాలనే ఉద్దేశంతో1699లో ఆయన ‘ఖాల్సా’ (విముక్తి) ని ఏర్పాటు చేశాడు. తన అనుచరులుగా ఉండాలంటే ‘పహుల్’ (సంస్కార ప్రక్రియ) పాటించాలి. అందులోని అయిదు ‘క’లు..  కేశ్ (జుట్టు), కర (ఇనుపగాజు), కంక్ (దువ్వెన), కచ్ (చిన్నలాగు), కృపాణ్​ (కత్తి) ధరించాలని రూల్ పెట్టాడు. వీటిలో కృపాణం తప్ప మిగతావన్నీ దీక్ష లేదా అంకితభావానికి ప్రతీకలు. పహుల్ చేసినవాళ్లంతా గురువు అనుచరులుగా మారి ఒక తెగగా మారారు. మిగతావాళ్లకు కులం అడ్డుగోడగా ఉందని ఆయన గ్రహించాడు. 

అసమానతలను పోగొట్టడం అంత సులభం కాదని అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత అనుచరులంతా ‘కీర్తినాశ్​’, ‘కుల్ నాశ్​’, ‘ధర్మనాశ్’, కర్మ్​నాశ్’ పాటించాలి అని చెప్పాడు. అంటే.. కీర్తి, కుటుంబం లేదా కులం, సనాతన మతం, కర్మను పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అంతేకాదు.. వాళ్లందరూ పేరు చివర సింహ్​ లేదా సింహం అని చేర్చుకోవాలని చెప్పాడు. ఆ విధంగా ఒక సైన్యాన్ని ఏర్పాటుచేశాడు. ఈ చర్యలతో పొరుగున ఉన్న నేతలు యుద్ధానికి కూడా దిగారు. 

చిన్న శత్రువులను ఎదిరించినప్పటికీ మరాఠాల మీద దండయాత్ర చేస్తోన్న ఔరంగజేబు చూపు సిక్కులపై పడింది. ఇంపీరియల్ సేనలు ఆనంద్​పూర్​ను కైవసం చేసుకున్నాయి. గోవింద్ అనుచరుల్లో 40 మంది మాత్రమే మిగిలారు. దాంతో అక్కడి నుంచి ఆయన రహస్యంగా వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఏడేండ్లు అతని సేనలు గోవింద్​ను వెంటాడాయి. మిత్రపక్షాలు మోసం చేశాయి. కొడుకులను కోల్పోయాడు. అనుచరుల్లో చాలామంది వెళ్లిపోయారు.

1706లో విజయ లేఖ (జఫర్​ నామా) రూపంలో పుస్తకాన్ని మొఘల్ చక్రవర్తికి రాశాడు. తను నమ్మే దైవానికి తప్ప ఎవరికీ తలవంచనని, చక్రవర్తి కూడా తన పాపాలను లెక్క చెప్పే రోజు వస్తుందనేవాడు. దీంతో ఔరంగజేబు గోవింద్​ను రమ్మని కబురు పంపాడు. కానీ, ఆ వార్త  ఆయనకు చేరకముందే చక్రవర్తి చనిపోయాడు. ఆ తర్వాత బహదూర్​ షా ఆహ్వానం మేరకు తన అనుచరులతో శిబిరానికి వెళ్లాడు. 

చక్రవర్తి దళాలతో సహా ఆయన్ను దక్కన్​కు పంపాడు. ఆ తర్వాత గోదావరి నది ఒడ్డున విశ్రమిస్తున్నప్పుడు ఒక పఠాన్​ తన తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకునేందుకు వచ్చాడు. గోవింద్ మీద కత్తితో దాడి చేసి​ చంపాడు. అప్పటికి ఆయన వేసిన ప్రణాళికలు పూర్తి కాలేదు. కానీ ఆయన చేసిన పనులు అప్పట్లో ప్రాచూర్యం పొందాయి. గురు పరంపర తనతోనే అంతమైందని, ఇక ముందు సిక్కులు మార్గదర్శకత్వం కోసం దేవుడిని ప్రార్థించాలని చేసిన ప్రకటన ఆయన సాధించిన వాటిలో ఉత్తమమైనదిగా నిలిచిపోయింది.

- మేకల మదన్​మోహన్​ రావు. కవి, రచయిత–