
బీట్రూట్తో రకరకాల రెసిపీలు చేసుకోవడం తెలిసిందే. కొందరైతే పచ్చిగా కూడా తినేస్తుంటారు. అయితే కాస్త వెరైటీగా, హెల్దీగా.. ఈవెనింగ్‌కి మంచి టైంపాస్ అయ్యేలా శ్నాక్ కావాలంటే వీటికి మించినవి అసలు ఉంటాయా? అనిపించేంత టేస్టీగా ఉంటాయి. మరింకెందుకాలస్యం.. వెంటనే బీట్ రూట్‌తో ఈ మూడు వెరైటీలు చకచకా చేసేయండి. సాయంత్రం వేళ వేడి వేడిగా ఈ శ్నాక్స్ని ఎంజాయ్ చేయండి.
ఓట్స్ కట్లెట్
కావాల్సినవి :బీట్ రూట్ తురుము – ఒక కప్పు, ఆలుగడ్డ (ఉడికించి), పచ్చిమిర్చి – ఒక్కోటి, శనగపిండి – అర కప్పు, ఉప్పు, నూనె – సరిపడా, మిరియాల పొడి, అల్లం తరుగు – ఒక్కోటి అర టీస్పూన్
తయారీ :ఒక గిన్నెలో బీట్ రూట్ తురుము, ఉడికించిన ఆలుగడ్డను మెదిపి వేయాలి. తర్వాత ఓట్స్, శనగపిండి, ఉప్పు, మిరియాల పొడి, అల్లం, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. మూతపెట్టి ఐదు నిమిషాలు పక్కన ఉంచాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని అరచేతిలో కట్లెట్ల్లా వత్తాలి. పాన్‌లో నూనె వేడి చేసి అందులో రెడీ చేసిపెట్టుకున్న కట్లెట్లు వేసి రెండు వైపులా వేగించాలి.
నగ్గెట్స్
కావాల్సినవి :బీట్రూట్ తురుము, బ్రెడ్ క్రంబ్స్ – ఒక్కోటి రెండు కప్పులు, ఆలుగడ్డలు (ఉడికించి) – మూడు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ – రెండు టీస్పూన్లు, కార్న్‌ఫ్లోర్ – మూడు టేబుల్ స్పూన్లు, వాము – పావు టీస్పూన్, ఉప్పు – సరిపడా, కారం – ఒక టీస్పూన్, గరం మసాలా, చాట్ మసాలా – ఒక్కోటి అర టీస్పూన్
తయారీ :ఒక గిన్నెలో బీట్ రూట్ తురుము, ఉడికించి, మెదిపిన ఆలుగడ్డలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, కార్న్‌ఫ్లోర్, వాము, ఉప్పు, కారం, బ్రెడ్ క్రంబ్స్ వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముద్దలా చేసి చిన్న చిన్న ఉండలుగా చేయాలి. వాటిని వేడి వేడి నూనెలో వేసి వేగిస్తే.. క్రిస్పీగా ఉండే బీట్ రూట్ నగ్గెట్స్ తినడానికి రెడీ. వీటిని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్, ఈవెనింగ్ శ్నాక్లా కూడా తినొచ్చు.
పకోడీ
కావాల్సినవి : బీట్ రూట్ తురుము, ఉల్లిగడ్డ తరుగు, శనగపిండి – ఒక్కో కప్పు
క్యాబేజీ తురుము – అర కప్పు
పచ్చిమిర్చి – రెండు
కొత్తిమీర – కొంచెం
పసుపు – పావు టీస్పూన్
కారం – ఒక టీస్పూన్
గరం మసాలా – అర టీస్పూన్
ఉప్పు – సరిపడా
తయారీ :ఒక గిన్నెలో బీట్ రూట్, క్యాబేజీ తురుము, ఉల్లిగడ్డ తరుగు, శనగపిండి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు వేసి అన్నింటినీ బాగా కలపాలి. పాన్‌లో నూనె వేడి చేసి అందులో బీట్ రూట్ మిశ్రమాన్ని పకోడీల్లా వేయాలి. వేగిన తర్వాత నూనె లేకుండా జల్లెడ గరిటెతో ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులో శనగపిండికి బదులు కాస్త మోతాదు తగ్గించి బియ్యప్పిండి వేయొచ్చు. అంతేకాదు.. బీట్రూట్లానే క్యారెట్తోనూ ఇలా పకోడీలు చేసుకోవచ్చు.