
కరీంనగర్: తెలంగాణలో బీజేపీ గెలిచిన 8 ఎంపీ సీట్లు దొంగ ఓట్లతో గెలిచినవేనని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా దొంగ ఓట్లతోనే గెలిచారని.. వాస్తవానికి కరీంనగర్లో బండి సంజయ్ గెలిచే పేస్ కాదని హాట్ కామెంట్స్ చేశారు. బండి సంజయ్ తెల్లారి లేస్తే బీసీ అని చెప్పుకుంటారని.. మరీ బీసీ రిజర్వేషన్ల కోసం ఆయన ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని తొలగిస్తే ఒక బీసీగా తాను గొంతెత్తానని.. ఒక బీసీ బిడ్డను అధ్యక్ష పదవి నుంచి ఎలా తొలగిస్తారని బీజేపీని ప్రశ్నించానని గుర్తు చేశారు.
ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుంటే బండి సంజయ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. భవిష్యత్ బీసీ తరాలకు ఒక బీసీ బిడ్డగా బండి సంజయ్ అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. మేం దేవుడిని నమ్ముతాం కానీ దేవుడి పేరుతో ఎప్పుడూ ఓట్ల అడగలేదని బీజేపీపై ఫైర్ అయ్యారు. ఎన్నికలప్పుడు దేవుడు.. గెలిచిన తర్వాత హిందూ-ముస్లిం గొడవలు పెట్టి పబ్బం గడుపుతారని కమలం పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివారం ( ఆగస్టు 24 ) కరీంనగర్లో రెండో విడత జనహిత పాదయాత్ర ప్రారంభించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆధ్యక్షతన ప్రారంభమైన ఈ పాదయాత్రలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. మన భవిష్యత్ కోసమే ఈ జనహిత పాదయాత్ర అని.. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికే ఈ పాదయాత్ర చేపట్టామని తెలిపారు.
కాంగ్రెస్ ఒక్కసారి మాట ఇస్తే తప్పకుండా నేరవేర్చి తీరుందన్నారు. రాష్ట్రంలో ఎన్నో అద్భుత పథకాలు కాంగ్రెస్ అమలు చేస్తోందని, రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తారని కలలోనైనా ఊహించామా అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలు కూడా సన్న బియ్యం అన్నం తినాలనే ఉద్దేశంతో రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ఇక, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, ఆ పార్టీ రాష్ట్రంలో లేదన్నారు. రాష్ట్రంలో అక్కడక్కడ ఉన్నది మతపిచ్చి పార్టీ బీజేపీ మాత్రమేనని అన్నారు.