మహా జాదుగాడు.. ఏకంగా ఎంపీల సంతకాలే ఫోర్జరీ చేసి ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్

మహా జాదుగాడు.. ఏకంగా ఎంపీల సంతకాలే ఫోర్జరీ చేసి ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియలో ఎంపీల సంతకాల ఫోర్జరీ కలకలం రేపింది. కేరళకు చెందిన ఓ వ్యక్తి ఎంపీల సంతకాలు ఫోర్జరీ చేసి ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశాడు. నామినేషన్ల పరిశీలనలో ఈ విషయం గుర్తించిన అధికారులు.. సదరు వ్యక్తి నామినేషన్‎ను తిరస్కరించారు. 

కేరళకు చెందిన జాకబ్ జోసెఫ్ అనే వ్యక్తి ఉప రాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేసేందుకు 22 మంది ఎంపీల సంతకాలతో కూడిన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‎పై సంతకాలు ఉన్న ఎంపీల్లో రాజ్య సభ, లోక్ సభకు చెందిన వారు ఉన్నారు. నామినేషన్ల పరిశీలనలో భాగంగా అధికారులకు జాకబ్ జోసెఫ్ నామినేషన్ పత్రాలపై అనుమానం కలిగింది. వెంటనే నామినేషన్ పత్రాలపై సంతకాలు ఉన్న ఎంపీలను అధికారులు ఆరా తీయగా.. జోమోన్ జోసెఫ్ ఎవరో తెలియదని.. తాము ఎలాంటి నామినేషన్ పత్రాలపై సంతకాలు పెట్టలేదని ఎంపీలు తెలిపారు.

దీంతో జోమోన్ జోసెఫ్ ఎంపీల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు గుర్తించిన అధికారులు.. అతడి నామినేషన్‎ను తిరస్కరించారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. జోమోన్ జోసెఫ్ నామినేషన్ పత్రాలపై ప్రస్తుతం జైలులో ఉన్న వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి సంతకం కూడా ఉంది. ఈ విషయాన్ని అధికారులు రాజ్యసభ సెక్రటేరియట్ దృష్టికి తీసుకెళ్లారు. 

నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 21 కాగా మొత్తం 46 మంది అభ్యర్థులు 68 నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో 19 మందికి చెందిన 28 నామినేషన్లను ప్రాథమిక దశలోనే రిజెక్ట్ అయ్యాయి. 27 మంది అభ్యర్థులకు చెందిన మిగిలిన 40 నామినేషన్లను ఆగస్టు 22న పరిశీలించారు. పరిశీలన తర్వాత సీపీ రాధాకృష్ణన్, బి సుదర్శన్ రెడ్డి ఇద్దరి నామినేషన్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. దీంతో  సీపీ రాధాకృష్ణన్, బి సుదర్శన్ రెడ్డి ఇద్దరి మధ్య వైస్ ప్రెసిడెంట్ ఫైట్ ఉండనుంది. 

జగదీప్ ధన్‎ఖడ్ రాజీనామాతో ఉప రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉప రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 2025, సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. 2025, ఆగస్టు 21 వరకు నామినేషన్ల దాఖలకు అవకాశం ఉండగా.. ఆగస్టు 25 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది ఈసీ. ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ బరిలోకి దిగగా.. ప్రతిపక్ష ఇండియా కూటమి తరుఫు నుంచి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు.