
- హైదరాబాద్ సహా జిల్లాల్లో కనిపిస్తున్న ఢిల్లీ నంబర్ ప్లేట్లు
- అగ్గువకు అందుబాటులో టాప్ మోడళ్లు
- దేశ రాజధానిలో నిషేధంతో ఇతర రాష్ట్రాల్లో అమ్మకాలు
- సరిగ్గా చెక్ చేసుకోకపోతే రిస్కే అంటున్న ఆఫీసర్లు
- ఎన్వోసీ తప్పనిసరిగా ఉండాలని సూచన
ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌ను ఢిల్లీ కార్లుముంచెత్తుతున్నాయి. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌సహా నగరాలు, పట్టణాలనే తేడా లేకుండా ఏ పాత వెహికల్స్షోరూమ్లో చూసినా ఢిల్లీ నెంబర్ ప్లేట్లతో ఉన్న కార్లే కనిపిస్తున్నాయి. అందరికీ అన్ని బడ్జెట్లలో సెకండ్ హ్యాండ్ కార్లు లభిస్తుండడంతో కొత్త వాటితో పోటీగా వీటి అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతున్నాయి.
ఇక్కడి సెకండ్ హ్యాండ్ కార్ల రేటుతో పోలిస్తే, ఢిల్లీ కార్లు 30 నుంచి 40 శాతం అగ్గువకే దొరుకుతుండడంతో కొనుగోలుదారులు కూడా వాటిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఓఎల్ఎక్స్‌లాంటి ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ వేదికగా కొందరు అమ్మకాలు, కొనుగోళ్లు చేస్తుంటే.. మరికొందరు అక్కడి నుంచి బల్క్‌గా కార్లు కొని తెప్పించి.. ఇక్కడి షోరూంలలో పెట్టి అమ్ముతున్నారు.
ఇంకొందరు సోషల్ మీడియాలో కార్లను చూపిస్తూ వీడియోలు పెట్టి, బుకింగ్‌లు కూడా తీసుకుంటున్నారు. ఒకేసారి ఎక్కువ కార్లు బుకింగ్ తీసుకొని, పెద్ద కంటైనర్లలో వాటిని ఇక్కడికి తెప్పించి.. కస్టమర్ ఇంటి దగ్గరకు డెలివరీ చేస్తున్నారు.
అగ్గువకు ఎందుకంటే!
గత కొన్నేండ్లుగా ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ విపరీతంగా పెరుగుతున్నది. ఈ కారణంతో పదేండ్లకు పైబడిన డీజిల్ కార్లను బ్యాన్ చేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. జులై 1 నుంచి ఢిల్లీలో అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం పదేండ్ల కంటే పాతబడిన డీజిల్ వాహనాలకు, పదిహేనేండ్లకు పైబడిన పెట్రోల్ వాహనాలకు ఇంధనం నింపడంపైనా అక్కడ నిషేధం విధించారు.
ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ నిబంధనల అమలును కాస్తా వాయిదా వేశారు. కానీ ఇప్పుడు కాకపోతే మరికొన్ని రోజులకైనా ఇలాంటి వాహనాలపై యాక్షన్ తప్పదని తేలడంతో వాటిని అమ్మాలని ఓనర్లు నిర్ణయించుకుంటున్నారు. కొంచెం పాత బండ్లను కూడా మార్చి ఎలక్ట్రిక్ కార్లను కొంటున్నారు. దీంతో ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయి, పదేండ్లకు పైబడిన 60 లక్షలకు పైగా కార్లు ఒక్కసారిగా పనికిరాకుండా పోయాయి.
వాటిని ఎంతో కొంతకు కొనుగోలు చేస్తున్న అక్కడి డీలర్లు, వాటిని ఇతర రాష్ట్రాలకు తరలించి అమ్మేస్తున్నారు. మన రాష్ట్రంలోని సెకండ్ హ్యాండ్ డీలర్లు వాటిని కొనుక్కొచ్చి, కొద్ది లాభంతో రీసేల్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఇక్కడ చిన్న కారు నడుపుకున్న వారు కూడా కొద్దిగా బడ్జెట్ పెంచుకొని, ఢిల్లీ నుంచి తెచ్చిన సెవెన్ సీటర్, రూ.20 లక్షల్లోపే బెంజ్, బీఎండబ్లూ, ఆడి లాంటి కార్లు కొనుక్కొని మురిసిపోతున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
తక్కువ రేటుకు వస్తుందని తొందరపడకుండా ఢిల్లీ కార్లను పూర్తిగా చెక్ చేసుకోవాలని, ఒరిజినల్ పేపర్లను చూసిన తర్వాతే కొనుగోలు చేయాలని నిపుణులు సూచి స్తున్నారు. బాడీ పెయింట్ నుంచి స్పేర్ పార్ట్స్ అన్నీ ఒరిజినల్‌వేనా? కాదా? అని సరిచూసుకోవాలన్నారు.