
నెట్‌ఫ్లిక్స్లో (NETFLIX) సినిమా వస్తుందంటే చాలు, అందులో ఏదో బలమైన సందేశం ఉండే ఉంటుంది. ఎవ్వరికీ తెలియని ఇన్ఫర్మేషన్ ఐనా ఉంటుంది. ఇలాంటి స్ట్రాంగ్ ఆలోచనతోనే ఉంటూవస్తున్నారు ఓటీటీ ఆడియన్స్. అందుకు మరో ముఖ్య కారణం.. క్రైమ్ సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్స్, డ్రామా ఓరియెంటెడ్ ఇలా ప్రతి జోనర్ సినిమాలు తీసుకురావడం నెట్‌ఫ్లిక్స్ ప్రత్యేకత. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓ రెండు సినిమాలు ఆడియన్స్ను తెగ థ్రిల్ అయ్యేలా చేస్తున్నాయి. అందులో ఒకటి ఫహద్ ఫాజిల్ నటించిన ‘మారీసన్’. మరొకటి కాజోల్ హిందీ మూవీ ‘మా’.
మారీశన్:
వడివేలు, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘మారీసన్’ (Maareesan). ఆగస్టు 22న నెట్‌ఫ్లిక్స్లో అడుగుపెట్టింది. తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతోంది. థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీ, ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. సుధీష్ శంకర్ తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కథ వివరాల్లోకి వెళితే..
కథేంటంటే:
దయాళన్ (ఫహద్ ఫాజిల్) ఒక దొంగ. సాధారణంగా అతను మనుషులు లేని ఇండ్లని టార్గెట్‌గా పెట్టుకుని దొంగతనం చేస్తుంటాడు. అలా ఒకసారి పట్టుబడి పాలయంకోట్టై జైలుకి వెళ్లి, అప్పుడే రిలీజ్ అవుతాడు. బయటికి వచ్చిన వెంటనే వేలాయుధం పిళ్లై (వడివేలు) ఇంటిని ఎంచుకుని దొంగతనం చేయడానికి లోపలికి చొరబడతాడు.
కానీ.. లోపల వేలాయుధం మంచానికి కట్టేసి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. తాను అల్జీమర్స్ రోగినని దయాకు పరిచయం చేసుకుంటాడు వేలాయుధం. తను తిరువన్నమలైలోని తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లాలని, అందుకోసం తనని దగ్గర్లోని బస్ స్టాండ్‌లో దింపమని అడుగుతాడు. అప్పుడే వేలాయుధం అకౌంట్‌లో రూ. 25 లక్షలు ఉన్నాయని దయా తెలుసుకుంటాడు. అతన్ని ఎలాగైనా మోసం చేసి ఆ డబ్బు కొట్టేయడానికి ప్లాన్ చేస్తాడు.
►ALSO READ | Balakrishna: ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో బాలకృష్ణ.. తొలి భారతీయ సినీ నటుడిగా హిస్టరీ క్రియేట్
అందుకే వేలాయుధాన్ని తన బైక్‌మీద తిరువన్నమలై వరకు దిగబెడతానని నమ్మించి తీసుకెళ్తాడు. అతను కోప్పడినా డబ్బు కోసం అన్నీ సహిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? దయాకు ఆ డబ్బు దక్కిందా? లేదా? తెలియాలంటే సినిమా చూడాలి.
‘మా’(MAA):
లేటెస్ట్ బాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘మా’. ఇది కూడా ఆగస్టు 22 నుంచి నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది. కాజోల్, యానీయా భరద్వాజ్, దిబ్యేందు భట్టాచార్య తదితరులు నటించారు. విశాల్ ఫురియా తెరకెక్కించారు. తమ పూర్వీకుల ఇంటికి తిరిగి వెళ్లిన తర్వాత ఒక కుటుంబాన్ని వెంటాడే భయానక దుష్ట శక్తి కథ ఇది. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోరాడుతూ, ఆ ఇంటి గతంలోని చీకటి రహస్యాలను తల్లి వెలికితీస్తుంది.
కథేంటంటే:
ఒక రాజ మహల్‌లో జమీందార్‌కు కవల పిల్లలు పుడతారు. ఆ వంశస్తులకు ఒక మర్మమైన శాపం ఉండడంతో వాళ్లలో ఆడపిల్లను అక్కడే బలిస్తారు. ఆమె కవల సోదరుడు షువంకర్ (ఇంద్రనీల్ సేన్‌గుప్తా) తర్వాతి కాలంలో ఊరిని విడిచివెళ్లిపోతాడు. అలా నలభై ఏండ్లు గడిచిపోతాయి. అతను భార్య అంబిక (కాజోల్), కుమార్తె శ్వేత (ఖేరిన్ శర్మ)తో కలిసి సిటీలో సెటిల్ అవుతాడు. తన తండ్రి చనిపోవడంతో షువంకర్ మళ్లీ సొంతూరికి వెళ్లాల్సి వస్తుంది. అంత్యక్రియల తర్వాత తన పూర్వీకుల ఇంటిని అమ్మాలి అనుకుంటాడు. అదే టైంలో శ్వేతను దుష్టశక్తులు పట్టిపీడిస్తాయి. అప్పుడు అంబిక తన బిడ్డను కాపాడుకోవడానికి ఏం చేసిందనేదే మిగతా కథ.