
- పది నెలల్లో రూ.13.71 కోట్లు కొట్టేసి పరార్!
- ఆడిటింగ్ లో బయటపడ్డ బాగోతం
- తొమ్మిది మందిపై కేసులు
మంచిర్యాల/చెన్నూర్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు ఎస్‌బీఐ క్యాషియర్ నరిగె రవీందర్ బాగోతం పూర్తిగా బట్టబయలైంది. అతడు మాయం చేసిన గోల్డ్, క్యాష్ విలువ రూ. 13.71 కోట్లుగా అధికారులు నిర్ధారించారు. లోన్ల కోసం కస్టమర్లు తాకట్టు పెట్టిన రూ.20.496 కిలోల బంగారం, రూ.1.10 కోట్ల క్యాష్‌తో ఉడాయించినట్లు తేల్చారు.
తన కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో అకౌంట్లు ఓపెన్ చేసి డబ్బులను వాటిలోకి తరలించినట్లు గుర్తించారు. బ్యాంక్ ఉన్నతాధికారులకు ఫిర్యాదుతో క్యాషియర్ రవీందర్‌తో పాటు మరో తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
గతేడాది అక్టోబర్ నుంచే..
చెన్నూరు ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఈ 20న ఉన్నతాధికారులు క్వార్టర్లీ ఆడిటింగ్ ప్రారంభించారు. ఈ సమయంలో కొంత గోల్డ్, క్యాష్ మిస్ అయినట్లు అనుమానం రావడంతో గురు, శుక్రవారాల్లో అర్ధరాత్రి వరకు ఆడిటింగ్ చేపట్టగా.. విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. బ్యాంక్‌లో మొత్తం 449 మంది కస్టమర్లు 25.175 కిలోల గోల్డ్ తాకట్టుపెట్టి లోన్లు తీసుకోగా.. ఇందులో నుంచి 402 మంది కస్టమర్లకు చెందిన 20.496 కిలోల బంగారంతో పాటు 1.10 క్యాష్ మాయమైనట్టు గుర్తించారు.
ఆడిటింగ్ ప్రారంభమైన నాటి నుంచి క్యాషియర్ నరిగె రవీందర్ డ్యూటీకి రాకపోవడంతో ఈ స్కామ్‌లో అతడే ప్రధాన పాత్రధారిగా తేల్చారు. రవీందర్ గతేడాది అక్టోబర్ నుంచే బంగారం, డబ్బు మాయం చేసి తన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్అకౌంట్లకు ఆన్‌లైన్, నెఫ్ట్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేసినట్లు గుర్తించారు.
పది మందిపై కేసు
ఎస్‌బీఐలో గోల్డ్, క్యాష్ ఎత్తుకెళ్లిన విషయంపై క్యాషియర్ రవీందర్, అతడికి సహకరించిన మరో తొమ్మిది మందిపై ఎస్‌బీఐ మంచిర్యాల రీజినల్ మేనేజర్ రితేశ్ కుమార్ గుప్తా శనివారం ఉదయం చెన్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు రవీందర్, అతడి భార్య సరిత, వదిన స్వర్ణలతతో పాటు కొంగొండి బీరేశ్, ఉమ్మల సురేశ్, కోదాటి రాజశేఖర్, గౌడ సుమన్, ఈసంపల్లి సాయికిరణ్, ఎల్.సందీప్, మోత్కూరి రమ్యపై కేసు నమోదు చేసి, ఎంక్వైరీ చేస్తున్నామని చెన్నూర్ టౌన్ సీఐ పి.దేవేందర్‌రావు తెలిపారు. కస్టమర్లు ఎవరూ ఆందోళన చెందొద్దని, గోల్డ్ మొత్తాన్ని రికవరీ చేస్తామని చెప్పారు.
ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌కు బానిసై..
బాసర ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తి చేసిన రవీందర్ 2017లో ఎస్‌బీఐలో క్యాషియర్‌గా సెలెక్ట్ అయ్యా డు. ఇతడికి భార్య సరిత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రవీందర్ ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లకు బానిసై భారీ మొత్తంలో నష్టపోయాడని, దీంతో పలువురి వద్ద అప్పులు చేశాడని.. చివరకు తాను పనిచేస్తున్న బ్యాంక్‌కే కన్నం వేసే స్థితికి వచ్చాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.
బ్యాంక్ నుంచి దొంగిలించిన బంగారాన్ని వివిధ బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నాడని తెలుస్తోంది. అంతేకాకుండా ఏడాది కింద భూమి అమ్మగా వచ్చిన రూ. 40 లక్షలు అప్పు కట్టడంతో పాటు తన అన్నకు తెలియకుండా వదిన పేరిట రూ.20 లక్షలకుపైగా లోన్ తీసి ఆ డబ్బులను కూడా బెట్టింగ్‌లో పోగొట్టుకున్నట్లు సమాచారం.
ఒక్కడే ఇంత పెద్ద స్కామ్ చేశాడా?
ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ రితేశ్‌కుమార్ గుప్తా ఫిర్యాదు మేరకు క్యాషియర్ రవీందర్‌నే ప్రధాన నిందితుడిగా పేర్కొన్నప్పటికీ... ఇంత పెద్ద స్కామ్ అతడొక్కడే చేశాడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతేడాది అక్టోబర్ నుంచి గోల్డ్, క్యాష్ మాయం అవుతుంటే.. మేనేజర్‌గానీ, ఇతర సిబ్బందిగానీ ఎందుకు గుర్తించలేకపోయారు ? మేనేజర్ దగ్గర ఉండే లాకర్ తాళాలు రవీందర్ చేతికి ఎలా వెళ్లాయి ? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో జరిగిన క్వార్టర్లీ ఆడిటింగ్‌లో సైతం ఈ స్కామ్‌ను గుర్తించకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
కస్టమర్లు ఆందోళన చెందొద్దు
చెన్నూర్ ఎస్‌బీఐలో జరిగిన అవకతవకలపై కస్టమర్లు ఎవరూ ఆందోళన చెందొద్దని, వారికి న్యాయం జరుగుతుందని రీజినల్ మేనేజర్ రితేశ్ కుమార్ గుప్తా చెప్పారు. శనివారం స్థానికంగా మీడియాతో మాట్లాడారు. బ్యాంకులోని క్యాష్‌లో అవకతవకలు జరిగినట్లు ఈ నెల 21న బ్రాంచ్ మేనేజర్ గుర్తించి.. తమకు సమాచారం ఇచ్చారన్నారు. పోలీసులు, బ్యాంక్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తున్నారని, నిందితుడిని త్వరలోనే పట్టుకొని బంగారం, డబ్బును రికవరీ చేస్తామని చెప్పారు.
వేములవాడలో తిరిగిన రవీందర్ ?
ఈ నెల 20న ఆడిటింగ్‌లో అవకతవకలు బయటపడడం, రవీందర్‌పై అనుమానాలు వ్యక్తం కావడంతో.. అతడు 21 నుంచి డ్యూటీకి రావడం మానేశాడు. ఈ నెల 21న మీటింగ్ ఉందని ఉదయం ఐదు గంటలకే ఇంటి నుంచి బయటకు వెళ్లిన రవీందర్.. అదే రోజు వేములవాడలో గుండుతో శెట్‌పల్లి గ్రామస్తులకు కనిపించాడని తెలిసింది.
అతడి మొబైల్ చివరగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ట్రేస్ అయినట్లు సమాచారం. కేసు నమోదైన తొమ్మిది మందిలో పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... రవీందర్‌ను పట్టుకోవడం కోసం స్పెషల్ టీమ్‌లను రంగంలోకి దించారు.