తమిళనాడులో ‘అంకుల్ వర్సెస్ బ్రో’ వార్: విజయ్‎కు వ్యతిరేకంగా భారీగా వెలిసిన పోస్టర్లు

తమిళనాడులో ‘అంకుల్ వర్సెస్ బ్రో’ వార్: విజయ్‎కు వ్యతిరేకంగా భారీగా వెలిసిన పోస్టర్లు

చెన్నై: తమిళనాడులో అంకుల్ వర్సెస్ బ్రో వార్ కాకరేపుతోంది. సీఎం స్టాలిన్‎పై నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్ చేసిన వ్యాఖ్యలు డీఎంకే, టీవీకే పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపాయి. సీఎం స్టాలిన్‎ను అంకుల్ అంటూ విజయ్ వ్యంగ్యస్త్రాలు సంధించడంపై డీఎంకే నేతలు ఫైర్ అవుతున్నారు. విజయ్‎కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేశారు డీఎంకే నేతలు. ‘వాట్ బ్రో.. ఓవర్ బ్రో’ అంటూ పోస్టర్ల ద్వారా విజయ్‎కు కౌంటర్ ఇస్తున్నారు డీఎంకే నేతలు. డీఎం వర్సెస్ టీవీకే పోస్టర్ వార్‎తో తమిళనాడు పాలిటిక్స్‎లో ఇప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. 

అసలేం జరిగిందంటే..?

2025, ఆగస్ట్ 21న మధురైలో మానాడు పేరుతో టీవీకే భారీ బహిరంగ సభ నిర్వహించింది. దాదాపు 4 లక్షల మంది హాజరైన ఈ కార్యక్రమంలో టీవీకే చీఫ్ విజయ్ గర్జించారు. విమర్శలు, డైలాగ్‎లు, పంచ్‎లతో అభిమానులు, కార్యకర్తలు ఉర్రూతలూగి పోయే స్పీచ్ ఇచ్చారు. డీఎంకే అధినేత సీఎం స్టాలిన్‌పైనా పంచ్‌ల వర్షం కురిపించారు. అంకుల్‌ అంటూ వ్యంగ్యంగా సంభోదించారు. ప్రస్తుత ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని.. మహిళలపై అఘాయిత్యాలు, నిరుద్యోగ సమస్య, లిక్కర్‌ స్కాం వంటి ఆరోపణలు ఉన్న డీఎంకే నేతలు మిస్టర్‌ క్లీన్‌ ఎలా అవుతారు.. ఇది కరెక్ట్ కాదు స్టాలిన్ అంకుల్ అంటూ విమర్శించారు. 

స్టాలిన్‎ను విజయ్ వ్యంగ్యంగా అంకుల్ అనడంపై డీఎంకే నేతలు మండిపోతున్నారు. ఈ క్రమంలోనే విజయ్‎కు వ్యతిరేకంగా ‘వాట్ బ్రో, ఓవర్ బ్రో’ అంటూ రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు అంటిస్తున్నారు. దీంతో డీఎంకే, టీవీకే మధ్య పోస్టర్ వార్ షురూ అయ్యింది. పెద్ద సంఖ్యలో అభిమానులు రావడం చూసి రాజకీయ సభలో విజయ్ సినిమా డైలాగులు కొడుతున్నారని.. కానీ సినిమాలు, రాజకీయాలు ఒకటి కాదని కౌంటర్ ఇస్తున్నారు డీఎంకే నేతలు. విజయ్‎కు రాజకీయ పరిపక్వత లేదని విమర్శిస్తున్నారు. సీఎం స్టాలిన్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు వ్యూహాలు మొదలుపెట్టాయి.