
వైశాలి నగరాన్ని ఏలే కీర్తిసేనుడికి చంద్రసేనుడనే కుమారుడు ఉన్నాడు. లేక లేక పుట్టిన బిడ్డ కావడంతో రాజు అతడిని అల్లారుముద్దుగా పెంచాడు. కానీ అతడు తన తోటి వారినే కాకుండా పెద్దలను కూడా పోకిరి పనులు చేసి బాధపెట్టేవాడు. రాజుగారి కొడుకు కావడం వల్ల పెద్దలు ఎవరు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఊరుకున్నారు.
మంత్రి ఈ సంగతి గ్రహించి రాజుగారి దృష్టికి తెచ్చాడు. రాజు అప్పుడు మంత్రిని సలహా అడిగాడు. మంత్రి ‘‘మహారాజా! ఇతనిని మన సదానందుని ఆశ్రమంలో చేర్పించండి. గురువుగారి ఆశ్రమంలో ఇతడు బుద్ధిమంతుడిగా మారే అవకాశం ఉంది’’ అని అన్నాడు. మంత్రి సూచనతో రాజు అతడిని ఆశ్రమంలో చేర్పించాడు.
కొన్ని రోజులకే గురువుగారు రాజాస్థానానికి యువరాజుతో పాటు తిరిగి వచ్చి రాజుగారితో ‘‘మహారాజా! నేను ఎంతోమందిని చూశాను. కానీ మన యువరాజులాగా ఎవరూ తుంటరి పనులు చేయలేదు. అతడు నా శిష్యులను కూడా ఇబ్బంది పెడుతున్నాడు. అతనివల్ల మా ఆశ్రమమే గాడి తప్పింది. అతడిని మార్చడం మా వల్ల కాదు. అందుకే తిరిగి తీసుకొని వచ్చాను. అతడు కొన్ని రోజులు నా దగ్గర ఉంటే నా శిష్యులు కూడా చెడిపోయే అవకాశం ఉంది” అని అన్నాడు.
ఆ విషయం విని రాజు గారికి విచారం పట్టుకుంది. తన కొడుకు బుద్ధిమంతునిగా మారుతాడా! లేదా! అనే సందేహం రాజుగారికి కలిగింది. ఇలా ఉండగా ఒకరోజు ఆ యువరాజు తోటలోని పండ్లను తెంపుకోవాలని చూశాడు. అతడు ఒక రాయిని పండు కేసి విసిరాడు. ఆ రాయి పొరపాటున ఒక కోతికి తగిలింది. ఆ కోతి దానితోపాటు ఇతర కోతులన్నీ చెట్లపైనుంచి దూకి ఆ రాకుమారిని గాయపరిచాయి .
రాకుమారుడు గట్టిగా ‘‘కాపాడండి.. కాపాడండి’’ అని అరిచాడు. ఇంతలో తోటమాలి యువరాజు అరుపులను విని పరుగున వచ్చి ఆ కోతులను వెళ్లగొట్టి రాకుమారుని కాపాడాడు. రాకుమారుడు గాయపడడం వల్ల బాధతో మూలగసాగాడు. అప్పుడు తోటమాలి అతనికి పరిచర్యలు చేశాడు. ఆ తర్వాత రాజ వైద్యుడు వచ్చి మందులు వేసి అతని గాయానికి కట్టు కట్టాడు.
ఆ తర్వాత యువరాజు ఆ తోటమాలిని తన భవనానికి పిలిపించుకున్నాడు. ‘‘తోటమాలీ! నువ్వు రాకుంటే ఆ కోతులు నా ప్రాణం తీసేవి. నాకు ఎంతో నొప్పిగా ఉంది’’ అని అన్నాడు. అప్పుడు తోటమాలి ‘‘తగ్గుతుంది యువ రాజా! మనం ఇతరులను బాధపెడితే వారికి కూడా అంత నొప్పి కలుగుతుందని మీరు తెలుసుకోండి.
మీరు విసిరిన ఆ రాయి ఆ కోతికి తగిలి దానికి బాధ కలిగింది. అందువల్లనే అది, దానితో పాటు మిగతా కోతులు వచ్చి మిమ్మల్ని గాయపరిచాయి. లేకుంటే ఇలా జరిగేది కాదు” అని అన్నాడు. ‘‘ఓహో! అలాగా! నేను ఇన్ని రోజులు ఎంతోమందిని ఇలా గాయపరిచాను. వారు ఇంత బాధ పడతారని నాకు తెలియదు. ఇకనుండి నేను అలా చేయను’’ అని అన్నాడు. ఆ మాటలకు తోటమాలి ఎంతో సంతోషపడ్డాడు.
కొన్ని రోజులకు ఆ యువరాజు గాయాలు మానిపోయాయి. అప్పుడు అతడు ‘‘నాన్నగారూ! నేను గురువుగారి ఆశ్రమానికి వెళ్లి విద్యను నేర్చుకుంటాను. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టను” అని అన్నాడు. రాజు సంతోషించి ఆ గురువుగారిని పిలిపించి తన కొడుకులో వచ్చిన మార్పు గురించి చెప్పాడు. ఆ గురువుగారిని చూసిన యువరాజు అతనికి వినమ్రంగా నమస్కరించాడు.
గురువుగారు ఆశ్చర్యపోయి యువరాజుతో ‘‘నీకు నా ఆశ్రమంలో చేరమని ఎవరు చెప్పారు!’’ అని అడిగాడు. ఆ యువరాజు ‘‘నన్ను కాపాడిన తోటమాలి’’ అని అన్నాడు. గురువుగారు సంతోషించి తన ఆశ్రమానికి అతన్ని తీసుకొని వెళ్ళాడు. అతడు ఆ ఆశ్రమంలో అందరితో ఎంతో సఖ్యతతో ప్రేమతో ఉండసాగాడు. అనుకోకుండా జరిగిన ఆ సంఘటన ఆ యువరాజులో చాలా మార్పును తెచ్చింది.
తోటమాలి ద్వారానే మంచి విషయాలు యువరాజుకు చెప్పించి, అతనిని గురువు గారి ఆశ్రమంలో విద్య నేర్చే లాగున చేసింది తన మంత్రి అని రాజుగారికి తెలియదు. ఏది ఏమైతేనేం యువరాజు మంచి వ్యక్తిత్వం కలవాడిగా తయారై అన్ని విద్యలను నేర్చుకున్నాడు. మంచి గురుభక్తి కలవాడుగా పేరు సంపాదించాడు.
- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య-