Ganesh Chaturdhi 2025: గణేశుడి మట్టి ప్రతిమ.. పత్రి పూజ ... ఆరోగ్య రహస్యాలు.. విశేష ఫలితాలు ఇవే..

Ganesh Chaturdhi 2025: గణేశుడి  మట్టి ప్రతిమ..  పత్రి పూజ ... ఆరోగ్య రహస్యాలు.. విశేష ఫలితాలు ఇవే..

జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగించమని వేడుకుంటూ వినాయక చవితి రోజు వినాయకుడిని పూజిస్తారు. ఈ పూజలో తప్పనిసరిగా 21 పత్రాలు ఉపయోగిస్తారు. అవి ఏ పత్రాలు, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, విశిష్టత ఏంటి అనేది తెలుసుకుందాం...

చవితి రోజు వినాయకుడికి 21 రకాల పత్రి (ఆకులు)తో పూజ చేస్తుంటారు. అయితే.. వాటిలో కొన్ని చెట్ల కొమ్మలను భూమిలో నాటినా తిరిగి ప్రాణం పోసుకుంటాయి. కాబట్టి ఆకుల కోసం తీసుకొచ్చిన వాటిలో మిగిలిన అలాంటి కొమ్మల్ని వీధుల్లో నాటాలి. అవి పరోక్షంగా ప్రకృతికి, మనుషులకు ఎంతో మేలు చేస్తాయి.

 వినాయకచవితి పూజలో అనేక ఆరోగ్య, వైద్య రహస్యాలు దాగి ఉన్నాయి. ఇందులో ఉపయోగించే ఏకవింశతి పత్రాలు సాధారణమైనవి కావు. అది మహోత్కృష్టమైన ఔషధం. కొత్త మట్టితో తయారుచేసిన ప్రతిమ, పత్రి మీదుగా వీచే గాలిని పీలిస్తే మనలో ఉండే అనారోగ్యాలు దూరమవుతాయి. తొమ్మిది రోజుల పూజ తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలని చాలామందికి సందేహం కలుగుతుంది. 

మట్టి ప్రతిమతో పాటు నిమజ్జనం చేసే పూజాద్రవ్యాలు నీటిలో కలిసిన తర్వాత వాటిలోని ఔషధీయ గుణం నీటిలోకి ప్రవేశిస్తుంది. ఆ విధంగా నీటిలోని బ్యాక్టీరియా చనిపోయి, ఆక్సిజన్‌‌‌‌ శాతం పెరుగుతుంది. 

గణేశుడిని పూజించే ఆకులు  

1. మాచీపత్రం:  మాచపత్రి అనేది తెలుగుపేరు. చేమంతి జాతికి చెందిన మొక్క. వీటి ఆకులు సువాసనా భరితంగా ఉంటాయి. చేమంతి ఆకుల మాదిరిగా ఉంటాయి.
2. బృహతీపత్రం  : దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని రెండు రకాలున్నాయి. వీటి ఆకులు వంగ ఆకుల మాదిరిగా, తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో ఉంటాయి.
3. బిల్వపత్రం :  బిల్వపత్రం అంటే మారేడు ఆకు. మూడు ఆకుల గుత్తి ఒకే ఆకుగా ఉంటాయి. ఇవి శివుడికి చాలా ప్రీతిపాత్రమైనవని ప్రతీతి.
4. దూర్వాపత్రం : దూర్వా పత్రం అంటే గరిక. తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలుంటాయి. ఈ గడ్డిజాతి మొక్కలు వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రం.
5. దత్తూర పత్రం:  అంటే ఉమ్మెత్త. ఇది వంకాయ జాతికి చెందినది. ముళ్లతో నిండిన కాయలు, వంకాయరంగు పూలు ఉంటాయి. 
6. బదరీపత్రం:  అంటే రేగు. దీనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అని మూడు రకాలు ఉంటాయి. 
7. అపామార్గపత్రం:   దీనినే ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా ఉంటాయి. గింజలు, ముళ్లు కలిగి ఉండి కాళ్లకు గుచ్చుకుంటాయి. 
8. తులసీపత్రం :  వీటి గురించి అందరికీ తెలిసినదే.
9. చూతపత్రం  : అంటే మామిడాకులు. మామిడాకులు మనకు కావలసిన ఆక్సిజన్‌‌‌‌ను విడుదల చేస్తాయి.
10. కరవీరపత్రం :అంటే గన్నేరు. తెలుపు, ఎరుపు, పసుపు రంగులలో ఉంటాయి.
11. విష్ణుక్రాంత పత్రం:   నీలి, తెలుపు రంగులలో పూలు పూసే చిన్న మొక్క.
12. దాడిమీ పత్రం:  దానిమ్మ.. ఇవి అజీర్ణవ్యాధులను అరికడుతుంది వాత, పిత్త, కఫాలను తొలగిస్తుంది
13. దేవదారు పత్రం:  దేవతలకు అత్యంత ఇష్టం. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో విగ్రహాలు చెక్కుతారు.
14. మరువక పత్రం : మరువం సువాసనలతో ఉంటుంది. ఆకులు ఎండినా కూడా సువాసన వస్తుంది.
15. సింధూరవార పత్రం  : వాడుకలో వావాలి అంటారు
16. జాజి పత్రం :సన్నజాజి, మల్లెజాతి మొక్క. వీటి పూలు సువాసనతో ఉంటాయి. వీటి నుంచి తైలం తీస్తారు.
17. గండకీ  పత్రం:  వీటిని లతాదూర్వా అంటారు. భూమి మీద తీగలా పాకి, కణుపులలో గడ్డిలా పెరుగుతుంది.
18. శమీ పత్రం:  ఈ చెట్టునే జమ్మి చెట్టు అంటారు. జమ్మి వృక్షాన్ని దర్శిస్తే చాలు పాపాలు తొలగిపోతాయని నమ్మకం. జమ్మి ఆకులతో కుట్టిన విస్తరిలో భోజనం చేస్తే జ్ఞానసంపన్నులు అవుతారని పెద్దలు చెబుతారు.
19. అశ్వత్థ పత్రం:  రావి. ఎంతో పవిత్రమైన వృక్షంగా పూజిస్తాం. ఆలయాలలో రావి చెట్లను దైవంగా భావిస్తూ, పెంచుతారు.
20. అర్జునపత్రం: దీనినే  - మద్ది పత్రం అని కూడా అంటారు. ఇవి మర్రి ఆకులను పోలి ఉంటాయి.
21. అర్క పత్రం :  జిల్లేడు. తెల్లజిల్లేడు వేరుతో తయారుచేసిన వినాయక ప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలం వస్తుంది.

మట్టి ప్రతిమే మేలు

పండుగ పేరుతో కొంతమంది పవిత్రతను నాశనం చేస్తున్నారు. పురాణంలో చెప్పిన రూపానికి బదులుగా వికృత రూపాలతో వినాయకుడి ప్రతిమలను తయారుచేస్తున్నారు.  శాస్త్రీయమైన భక్తి పాటలు, వేదపారాయణం లాంటివి కాకుండా నోటితో పలుకరాని, చెవులతో వినరాని పాటలు పెట్టి, పవిత్రతను నాశనం చేస్తున్నారు. వినాయకుడిని పార్వతీదేవి సున్నిపిండితో తయారుచేసింది. కాబట్టి భక్తులు కొత్తమట్టితో తయారుచేయాలి. అలా చేస్తేనే పర్యావరణానికి మేలు కలుగుతుంది. 

- డా. పురాణపండ వైజయంతి-