పాపం.. వరంగల్ పబ్లిక్కే తెలుసు ఈ తిప్పలు ఎట్లుంటయో.. కాదని చెప్పమనండి వరంగలోళ్లను..!

పాపం.. వరంగల్ పబ్లిక్కే తెలుసు ఈ తిప్పలు ఎట్లుంటయో.. కాదని చెప్పమనండి వరంగలోళ్లను..!
  • పండగొస్తే..  పార్కింగ్ పరేషాన్!
  • గ్రేటర్ వరంగల్లో చాలా కాంప్లెక్సులు, మాల్స్కు పార్కింగ్ ప్లేసులు కరువు
  • కొన్నిచోట్లా సెల్లార్లున్నా ఇతర అవసరాలకు వినియోగం
  • పార్కింగ్ కు స్థలాలు లేక బండ్లన్నీ రోడ్లపైనే
  • మాటలకే పరిమితమైన మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్
  • జనాలకు తప్పని ఇబ్బందులు

హనుమకొండ, వెలుగు: పండగలు వచ్చాయని షాపింగ్ కోసం వరంగల్ నగరానికి వెళ్తే ట్రాఫిక్ చిక్కులు, పార్కింగ్ సమస్యలు తప్పడం లేదు. సిటీలో వెలిసిన షాపింగ్ మాల్స్, కమర్షియల్ కాంప్లెక్సులు సెల్లార్లను ఇతర అవసరాలకు వినియోగించుకుంటుండగా, మల్టీ షాపింగ్ కోసం వచ్చే వాహనాలకు పార్కింగ్ ప్లేసుల్లేకపోవడం సమస్యగా మారుతోంది. దీంతో షాపింగ్ కోసం వచ్చే బండ్లన్నీ రోడ్ల మీదనే పార్క్ చేస్తుంటంతో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. కాగా, గ్రేటర్ వరంగల్ నగరంలో మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ కోసం గతంలో ప్రపోజల్స్ రెడీ చేసినా, కాగితాలకే పరిమితమైంది. ఫలితంగా సిటీలో పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతుండగా, పండుగల సమయంలో సమస్యలు తీవ్రమవుతున్నాయి.

డైలీ లక్షకు పైగా వెహికల్స్..
ఉమ్మడి జిల్లాలో విద్య, వైద్యం, హోటల్స్, షాపింగ్ మాల్స్, ఇతర బిజినెస్ లకు గ్రేటర్ వరంగల్ నగరమే కీలకం. దీంతో వివిధ అవసరాలతోపాటు హనుమకొండ, వరంగల్ జిల్లాల ప్రభుత్వ ఆఫీసుల కోసం వచ్చే వెహికల్స్ తో గ్రేటర్ సిటీ రోడ్లన్నీ ఫుల్ రష్ గా ఉంటున్నాయి. నగర రోడ్లపై డైలీ లక్షకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని పోలీస్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా గతంలో మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ కోసం జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు ప్రపోజల్స్ రెడీ చేశారు. పీపీపీ పద్ధతిలో నిర్వహించేందుకు ప్రణాళికలు రచించారు. హనుమకొండ అశోక సెంటర్ తోపాటు చౌరస్తాలోని ఓపెన్ ప్లేస్ ను కూడా పరిశీలించారు. ఆ తర్వాత లీడర్లు, ఆఫీసర్లు పట్టించుకోక మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ కాస్త కాగితాలకే పరిమితమైంది.

సెల్లార్లపై నో యాక్షన్..
గ్రేటర్ వరంగల్ సిటీలో వందల సంఖ్యలో షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, కమర్షియల్ కాంప్లెక్సులున్నాయి. ఇందులో చాలా బిల్డింగులకు సెల్లార్లున్నా వాటిని ఇతర బిజినెస్ లకు వినియోగిస్తున్నాయి. సెల్లార్లను పార్కింగ్ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలనే రూల్ ఉండగా, నగరంలో 90 శాతం కాంప్లెక్సులు సెల్లార్లలో ఇతర బిజినెస్ లకో, సెక్యూరిటీ గార్డ్స్ షెల్టర్ కోసమో వినిగిస్తున్నాయి. ఇంకొన్ని బిల్డింగులు అక్కడ అవసరాలకు సరిపడా పార్కింగ్ ప్లేసులు చూపడం లేదు. ఫలితంగా ఆయా కాంప్లెక్సులకు వచ్చే వాహనాలను రోడ్లపైనే పెట్టాల్సి వస్తోంది.

నయీంనగర్, పెట్రోల్ పంప్, సుభేదారి, హనుమకొండ బస్టాండ్ ఏరియా, చౌరస్తా, హంటర్ రోడ్డు, పోచమ్మ మైదాన్, వరంగల్ చౌరస్తా ఇలా చాలాచోట్లా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు. దాదాపు నాలుగేండ్ల కింద జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, సెల్లార్లలో బిజినెస్ చేస్తున్న కాంప్లెక్సులను గుర్తించారు. ఒకట్రెండు చోట్లా సెల్లార్లలో నిర్వహిస్తున్న షాపులు, రూమ్ లను తొలగించి హడావుడి చేశారు. ఆ తర్వాత గాలికొదిలేయడంతో కాంప్లెక్సులు, కమర్షియల్ బిల్డింగుల ఓనర్లు సెల్లార్లను ఇతర అవసరాలకు వినియోగిస్తూ వెహికల్స్ ను రోడ్లపై పార్క్ చేయిస్తున్నారు.

ఫెస్ట్వల్స్​ టైంలో ట్రాఫిక్ తిప్పలు..
పార్కింగ్ ప్లేసులు లేకపోవడం, సెల్లార్లున్నా సరిగా వినియోగించలేని పరిస్థితి నెలకొనడంతో సిటీకి వచ్చే బండ్లన్నీ రోడ్లపైనే ఉంటున్నాయి. సాధారణ రోజుల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతుండగా, పండుగల సమయంలో సమస్య తీవ్రమవుతోంది. షాపింగ్ కాంప్లెక్సులు ఎక్కువగా ఉండే హనుమకొండ చౌరస్తా, విజయ టాకీస్ రోడ్డు, వరంగల్ చౌరస్తా, బట్టల బజార్, బీట్ బజార్, పోచమ్మ మైదాన్ తదితర ప్రాంతాల్లో తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేసేందుకు గతంలో జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు కసరత్తు చేశారు. ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో నగరంలో బండ్లు పెట్టేందుకు రోడ్లే దిక్కవుతున్నాయి. ఇప్పటికైనా గ్రేటర్ సిటీకి వచ్చే వెహికల్స్ పార్కింగ్ తోపాటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు, నగర ప్రజలు కోరుతున్నారు.