అవాక్కయ్యారా.. : ఆయాల జీతం రోజుకు రూ. లక్షా 60 వేలు.

అవాక్కయ్యారా.. : ఆయాల జీతం రోజుకు రూ. లక్షా 60 వేలు.

ఎవరైనా రోజుకు రూ.2000లో లేక మహా అయితే మూడు వేలో సంపాదించటం ఈ రోజుల్లో చాలా కష్టంగా మారింది. కానీ ఒక మహిళ తనకున్న ప్రత్యేక నైపుణ్యంతో రోజుకు ఏకంగా లక్షా 60 వేల జీతాన్ని పొందుతోంది. ఇప్పుడు ఈ వార్త ఇంటర్నెట్ లో వైరల్ గా మారిపోయింది. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది గ్లోరియా రిచర్డ్స్ అనే 34 ఏళ్ల మహిళ గురించి. ఈమె అత్యంత సంపన్నుల పిల్లలకు నానీ(ఆయా)గా పనిచేస్తుంటుంది. ఇది ఆమెకు లభించే సైడ్ ఇన్కమ్. ఆమె చేస్తున్న ఈ ఉద్యోగం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ జెట్‌లలో వెళుతూ ఏకంగా రోజుకు రూ.1.6 లక్షల వరకు సంపాదిస్తోంది. 

వాస్తవానికి రిచర్డ్స్ ఒక నటి. అయినప్పటికీ ఆమె ఏడాదిలో దాదాపు సగం సమయం బిలియనీర్ల పిల్లల కోసం నానీగా పనిచేస్తుంటుంది. ఆమె వార్షిక ఆదాయంలో దాదాపు 80- 90 శాతం సంపాదన దీని ద్వారానే పొందుతోంది. ఆమె రోజూ 12-15 గంటల పాటు చేసే పనికి గాను భారీ మెుత్తాన్ని అందుకుంటోంది. నానీగా ఆమె సాధారణంగా పిల్లలతో కలిసి విదేశాలకు వెళుతుంటుంది. వారి సామాజిక క్యాలెండర్‌లను సమన్వయం చేయటం, అనేక సందర్భాల్లో స్టాండ్-ఇన్ పేరెంట్‌గా వ్యవహరిస్తుంటుంది.

రిచర్డ్స్ ఒక నల్ల జాతీయురాలు. అయితే కొన్ని సార్లు తెల్ల పిల్లలకు నానీగా పనిచేయటం కొంత సవాళ్లతో కూడుకున్నదేనని ఆమె తెలిపారు. కొన్నిసార్లు ధనవంతులు సైతం తనకు డబ్బులు చెల్లించకుండా తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటారని ఆమె వెల్లడించారు. అలాంటి సందర్భంలో మాడిసన్ ఏజెన్సీ మద్దతు తీసుకుని బకాయిలను సకాలంలో పొందినట్లు తెలిపారు. కొన్నిసార్లు తాను ఉద్యోగంలో జాత్యహంకారాన్ని సైతం ఎదుర్కొన్నానని ఆమె వెల్లడించారు. నల్లజాతీయురాలైన తాను అనేక మాట్లు శ్వేతజాతీయుల కుటుంబాల కోసం పనిచేస్తున్నానని.. వారికి ఉండే 6-7 ఏళ్ల పిల్లలకు..  తనలాగా కనిపించేవారిపై చాలా నిర్దిష్టమైన ఆలోచనలు ఉంటాయని రిచర్డ్స్ వివరించారు. అయితే తాను పొందుతున్న ప్రోత్సాహకాలు ప్రతికూలతలను అధిగమించేలా చేస్తున్నాయని ఆమె వెల్లడించారు