
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర హైకోర్టుకు మరో 10 మంది కొత్త జడ్జిలు రానున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులతో వీరి నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. వీరందరితో ఈనెల 23న హైకోర్టు సీజే సతీశ్ చంద్ర శర్మ ప్రమాణం చేయిస్తారని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రమేశ్ శనివారం పత్రికా ప్రకటనలో వెల్లడించారు. జస్టిస్ కాసోజు సురేందర్, జస్టిస్ సూరేపల్లి నంద, జస్టిస్ సుధీర్ కుమార్, జస్టిస్ శ్రీదేవి, జస్టిస్ వెంకట శ్రావణ్ కుమార్, జస్టిస్ అనుపమ చక్రవర్తి, జస్టిస్ ప్రియదర్శిని, జస్టిస్ సాంబశివ నాయుడు, జస్టిస్ సంతోశ్ రెడ్డి, జస్టిస్ నాగార్జున ప్రమాణం చేయనున్నారు. ప్రస్తుతం సీజేతో కలిపి 19 మంది జడ్జీలుగా ఉండగా.. ఇప్పుడు మరో 10 మంది కొత్త జడ్జిలు వస్తున్నారు. వీరితో కలిసి హైకోర్టులో జడ్జిల సంఖ్య 29కి పెరగనుంది.