ట్రంప్ మెడకు మరో కేసు

ట్రంప్ మెడకు మరో కేసు

వాషింగ్టన్: అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్(77) పై కొత్తగా మరో నాలుగు నేరాభియోగాలు నమోదయ్యాయి. 2020 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ఆయన తారుమారు చేయడానికి ప్రయత్నించారని జస్టిస్ డిపార్ట్ మెంట్ స్పెషల్ కౌన్సిల్ జాక్ స్మిత్ వెల్లడించారు.  మంగళవారం ఆయన..  ట్రంప్​పై 45 పేజీల నేరాభియోగ ఫైల్​ను రిలీజ్ చేశారు. అందులో ట్రంప్ అమెరికాను మోసం చేసేందుకు ప్రయత్నించారని, ప్రభుత్వ పనులను అడ్డుకునే కుట్ర చేశారని, ప్రజల హక్కులకు వ్యతిరేకంగా కుట్ర పన్నారని,  సాక్ష్యాలను తారుమారు చేయాలని యత్నించారని నాలుగు ప్రధాన అభియోగాలు పేర్కొన్నారు. తాజా నేరాభియోగాలతో ట్రంప్ పై ఈ ఏడాదిలోనే మూడో క్రిమినల్ కేసు నమోదైంది.

 2020 ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓడిపోయినప్పటికీ ట్రంప్ తన మద్దతుదారులను కావాలనే తప్పుదోవ పట్టించాడని జాక్ స్మిత్ ఆరోపించారు. తన ప్రసంగాలతో దేశ ప్రజల్లో అపనమ్మక వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నించాడని అన్నారు. ఎలాగైనా తానే మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని ట్రంప్ ఈ కుట్రలు చేశాడని తెలిపారు. తాజాగా నమోదైన కేసు విచారణలో భాగంగా ట్రంప్.. గురువారం న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని వాషింగ్టన్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆదేశించింది.  ఇప్పటికే ఆయనపై పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌‌‌‌‌‌‌‌కు డబ్బులు ఇచ్చిన కేసు, వైట్‌‌‌‌‌‌‌‌హౌస్ రహస్య పత్రాలు దాచిన కేసు ఉన్నాయి. కాగా, ఈ ఆరోపణలను మాజీ ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్ కొట్టిపారేశారు. ఈమేరకు సోషల్​ మీడియాలో తన మద్దతుదారులు, అమెరికన్ ప్రజలను ఉద్దేశించి ఓ వివరణ పోస్టు చేశారు.