ఎవుసం కలిసి రాక.. కూలీగా మారినా అప్పు తీరక మరో రైతు ఆత్మహత్య

ఎవుసం కలిసి రాక.. కూలీగా మారినా అప్పు తీరక మరో రైతు ఆత్మహత్య

సిద్దిపేట జిల్లా చిట్టాపూర్​లో ఘటన

దుబ్బాక, వెలుగు: అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తే దిగుబడి రాక రైతన్న కూలీగా మారిండు. కొంతకాలంగా అడ్డా మీద  పనికి పోతున్నా.. కుటుంబ పోషణకు కూడా ఆపైసలు సరిపోవడం లేదు. అప్పులు తీరడం లేదు. దీంతో కలత చెంది ఆత్మహత్య చేసుకున్నడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్​లో శుక్రవారం జరిగింది.  గ్రామానికి చెందిన చౌడం స్వామి(53) తనకున్న రెండెకరాల్లో రెండు బోర్లు వేసి వరి సాగుచేస్తున్నాడు. కానీ కొంత కాలంగా ఆశించిన దిగుబడి రావడంలేదు. దీంతో కూలీగా మారి, సిద్దిపేటలో పనులకు పోతున్నాడు. రోజువారీ కూలిపని చేసి వచ్చిన డబ్బులతో తల్లి మల్లవ్వ, భార్య అనసూయ, కూతురు లక్ష్మిని పోషిస్తున్నాడు. కూలీ పైసలు రోజు వారీ ఖర్చులకే సరిపోతుండగా.. గతంలో బోర్ల కోసం తెచ్చిన​ రూ. 5 లక్షల అప్పు పెరిగింది. ఈసారి రెండెకరాల్లో వరి వేసినా ఆశించిన దిగుబడి రాలేదు. దీంతో అప్పులు తీర్చలేనని కలత చెందిన స్వామి శుక్రవారం తెల్లవారు జామున తన పొలంలోని చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. కూతురు లక్ష్మి ఆయనకు అంత్యక్రియలు నిర్వహించింది. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్​ పోతనక రాజయ్య 
విజ్ఞప్తి చేశారు.