ఈ నెల 15న ‘ద లైఫ్‌‌ ఆఫ్ ముత్తు’ రిలీజ్

ఈ నెల 15న ‘ద లైఫ్‌‌ ఆఫ్ ముత్తు’ రిలీజ్

బేసిగ్గా తమిళ హీరోనే అయినా శింబు అంటే తెలుగువారికి కూడా ఇష్టమే. మన్మథ, వల్లభ, మానాడు లాంటి చిత్రాలతో ఇంప్రెస్ చేయడమే అందుకు కారణం. ఇప్పుడు శింబు నటించిన మరో సినిమా తెలుగులోకి వస్తుంది. గౌతమ్‌‌ మీనన్ డైరెక్ట్ చేసిన ‘వెందు తుణీందదు కాడు’ మూవీని ‘ద లైఫ్‌‌ ఆఫ్ ముత్తు’ పేరుతో తెలుగులో స్రవంతి రవికిశోర్ విడుదల చేస్తున్నారు.

ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ‘ట్రైలర్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. శింబు యాక్టింగ్ గురించి, గౌతమ్ మీనన్ టేకింగ్ గురించి, రెహమాన్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీళ్లందిరకీ తెలుగులో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అందుకే ఈ మూవీని టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని డిసైడయ్యాను. ఇంతకు ముందు మా సంస్థ ద్వారా నాయకుడు, పుష్పకవిమానం, రెండు తోకల పిట్ట, రఘువరన్ బీటెక్ చిత్రాలు డబ్ చేశాం. అవి మంచి విజయం సాధించాయి. ఇది కూడా తప్పక నచ్చుతుంది. ఈ నెల 15న గ్రాండ్ రిలీజ్’ అని చెప్పారు. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రంలో సిద్ధి ఇద్నానీ హీరోయిన్‌‌గా నటించింది. రాధికా శరత్‌‌కుమార్ కీలక పాత్రలో నటించారు.