బీహార్‌లో మరో దారుణం.. నడిరోడ్డుపై మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన.. నలుగురు అరెస్ట్!

బీహార్‌లో మరో దారుణం.. నడిరోడ్డుపై  మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన.. నలుగురు అరెస్ట్!

బీహార్‌లోని జముయి జిల్లాలో ఓ మైనర్ బాలికపై వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపిన కొద్ది రోజుల్లోనే, సమస్తిపూర్ జిల్లాలో అలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. బహిరంగ నడిరోడ్డుపై ఒక మైనర్ బాలికను కొందరు వ్యక్తులు చుట్టుముట్టి వేధింపులకు గురిచేయడమే కాకుండా, ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవ్వగా, పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి నలుగురిని అరెస్ట్ చేశారు. 

అసలేం జరిగిందంటే..
ఈ ఘటన బీహార్‌లోని  సమస్తిపూర్ జిల్లా కర్పూరిగ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగత్‌సింగ్‌పూర్ గ్రామం, కట్ట బైపాస్ రోడ్డు సమీపంలో చోటుచేసుకుంది. ఒక మైనర్ బాలుడు, బాలిక బైక్ పై అక్కడకు వచ్చి మాట్లాడుకుంటుండగా కొందరు స్థానిక యువకులు, వ్యక్తులు వారిని చుట్టుముట్టారు. మొదట ఆ బాలుడిపై దాడి చేయడంతో అతను అక్కడి నుంచి భయంతో పారిపోయాడు. ఆ తర్వాత ఆ గ్యాంగ్ ఒంటరిగా ఉన్న బాలికను చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తించింది. ఆమె ఊరు, అడ్రస్ ఏంటని ప్రశ్నిస్తూ తీవ్రంగా దూషించారు.

దింతో ఆ గుంపు ప్రవర్తనపై  బాలిక తీవ్రంగా ప్రతిఘటించింది. తన సోదరుడికి ఫోన్ చేసి పిలుస్తానని చెప్పగా, ఆ వ్యక్తులు ఆమె సోదరుడిని కూడా అసభ్య పదజాలంతో దూషించారు. వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు ఆ బాలికను అసభ్యంగా తాకడం, దాన్ని ఆ బాలిక గట్టిగా ప్రతిఘటించడం స్పష్టంగా కనిపించింది. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాలను రికార్డ్ చేసి నెట్‌లో పోస్ట్ చేశారు.

రంగంలోకి పోలీసులు, నలుగురి అరెస్ట్

ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో సమస్తిపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) అరవింద్ ప్రతాప్ సింగ్ వెంటనే స్పందించారు. ఈ ఘటనపై సుమోటోగా ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసి, విచారణ వేగం  చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించారు.

వీడియో ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు  రాహుల్ కుమార్ (19 సంవత్సరాలు), అవధేష్ పాశ్వాన్ (46 సంవత్సరాలు), వికాస్ శర్మ (32 సంవత్సరాలు), రాంబాబు సాహ్ని (38 సంవత్సరాలు)  అనే నలుగురిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీడియోలోని మిగతా దృశ్యాలు, ఘటనకు సంబంధించిన వివరాలపై పూర్తి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

జముయి ఘటన వేడి చల్లారకముందే..
కొద్ది రోజుల క్రితమే బీహార్‌లోని జముయి జిల్లాలో ఓ మైనర్ బాలికలను 'మోరల్ పోలీసింగ్' పేరుతో కొందరు వేధించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ కేసులో పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఆ ఘటన మరువకముందే సమస్తిపూర్‌లో కూడా మైనర్ బాలికపై ఇలాంటి వేధింపులు జరగడం పట్ల మహిళల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.