ఉగ్రవాదుల కిరాతకం..మరో కశ్మీరీ పండిట్ హత్య

ఉగ్రవాదుల కిరాతకం..మరో కశ్మీరీ పండిట్ హత్య

జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. కశ్మీరీ పండిట్ను దారుణంగా కాల్చి చంపారు. షోపియాన్ జిల్లాలోని చౌదరీ గుండ్ ఏరియాలో పురాన్ క్రిషన్ భట్ అనే వ్యక్తిని అతని ఇంటి వద్దే కాల్చి చంపారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొని టెర్రరిస్టుల కోసం గాలిస్తున్నాయి. పురాన్ క్రిషన్ కు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. 

కశ్మీర్ ఫ్రీడం ఫైటర్స్ అనే సంస్థ ఈ దాడికి బాధ్యత వహించిందని డీఐజీ సుజిత్ కుమార్ తెలిపారు. ఎందుకు హత్య చేశారన్న దానిపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. ‘‘ కశ్మీరీ పండిట్ పురాన్ క్రిషన్ భట్ స్కూటర్ పై బయటకు వెళ్లి వచ్చాడు. ఆ సమయంలో అతడితో పాటు ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు. గుర్తు తెలియని ఒక వ్యక్తి వచ్చి దాడికి పాల్పడ్డాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు’’ అని సుజిత్ కుమార్ తెలిపారు.

ఉగ్రవాదుల చర్యను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఖండించారు. ఇది పిరికిపంద చర్య అని మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యలైన వారిని విడిచిపెట్టం అని స్పష్టం చేశారు. ఇంతకుముందు అగస్ట్ 16న షోపియాన్ జిల్లాలోనే ఆపిల్ తోటలో సునీల్ కుమార్ అనే పండిట్ ను టెర్రరిస్టులు కాల్చి చంపారు. కొద్ది నెలలుగా కశ్మీరీ పండిట్లే లక్ష్యంగా దాడులు జరుగుతుండడంతో తమకు రక్షణ కల్పించాలని పండిట్లు డిమాండ్ చేస్తున్నారు.