
హైదరాబాద్, వెలుగు: సంతానం లేని దంపతుల ఆశలను ఆసరాగా చేసుకొని రాష్ట్రంలో కొన్ని ఫెర్టిలిటీ సెంటర్లు రెచ్చిపోతున్నాయి. వారిని నమ్మించి, లక్షలకు లక్షలు గుంజి.. నట్టేట ముంచుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ సెంటర్లు.. రూల్స్‌ను ఖాతరు చేయడం లేదు. ఈ దందాను అడ్డుకోవాల్సిన అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అండ్సరోగసి బోర్డు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా సృష్టి టెస్ట్ట్యూబ్సెంటర్బాగోతం కలకలం సృష్టిస్తున్నది. సరోగసీ పేరిట ఓ జంటను నమ్మించి రూ. 40 లక్షల దాకా వసూలు చేసి.. రూ. 90 వేలతో ఓ బిడ్డను కొని ఆ జంటకు అప్పగించినట్లు విచారణలో తేలింది. ఇలాంటి దందాలు చేసే సెంటర్లు రాష్ట్రంలో చాలానే ఉన్నట్లు తెలుస్తున్నది.
పీసీవోడీ సమస్య ఉందని భయపెట్టి..!
వరంగల్‌కు చెందిన 32 ఏండ్ల ఓ మహిళ.. పెండ్లయి ఆరేండ్లయినా పిల్లలు లేక హైదరాబాద్‌లోని ఓ ఫెర్టిలిటీ క్లినిక్‌ను సంప్రదించింది. ‘మీకు పీసీవోడీ సమస్య తీవ్రంగా ఉంది. వెంటనే ఐవీఎఫ్ చేయాలి. లేకపోతే కష్టం’ అని క్లినిక్ నిర్వాహకులు భయపెట్టారు. అప్పుడున్న ఆందోళనతో వెంటనే ఆమె ఐవీఎఫ్‌కు ఒప్పుకుంది. రూ. 2.5 లక్షల బిల్లు వేశారు. అయితే చికిత్స సమయంలో అనేక టెస్టులు, ఇంజెక్షన్ల పేరుతో అదనంగా రూ. ఒక లక్ష వసూలు చేశారు.
దురదృష్టవశాత్తు, సైకిల్ విఫలమైంది. ఆ మహిళ ఆ క్లినిక్‌ను నిలదీయగా.. ‘అది నార్మల్. తదుపరి సైకిల్‌కు డిస్కౌంట్ ఇస్తాం’ అని చెప్పి మళ్లీ డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించారు. దీంతో ఆ మహిళ వేరే డాక్టర్‌ను సంప్రదించి, తన పీసీవోడీ సమస్యకు ఐవీఎఫ్ అవసరం లేదని తెలుసుకుంది. కేవలం ట్యాబ్లెట్స్, ఇతర మార్గాలలో పీసీవోడీ తగ్గే అవకాశం ఉండగా.. నేరుగా ఐవీఎఫ్‌కు రిఫర్ చేయడం వెనక ఫెర్టిలిటీ సెంటర్ వాళ్లు డబ్బులు గుంజే పనిపెట్టుకున్నట్లు గుర్తించింది.
పీజీటీ టెస్టు పేరిట..!
హైదరాబాద్‌లో నివసించే ఓ జంట పిల్లల కోసం ఓ ఐవీఎఫ్ సెంటర్‌ను సందర్శించారు. ‘‘మీ పిండాల్లో జన్యులోపాలున్నాయి. అందుకే గర్భం నిలబడట్లేదు. పిండాల్లో లోపాలు గుర్తించడానికి పీజీటీ (ప్రీఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్) చేయాలి. దీనికి రూ. 2 లక్షలు అవుతుంది’ అని సెంటర్ నిర్వాహకులు చెప్పారు. ఆ జంటకు ఇంతకు ముందు ఎటువంటి జన్యు సమస్యలు ఉన్నట్లు నిర్ధారణ కాలేదు. కానీ, పిల్లల కోసం ఆశతో ఆ డబ్బు చెల్లించారు. పీజీటీ చేసిన తర్వాత కూడా మొదటి ప్రయత్నం విఫలమైంది. ఒక సీనియర్ గైనకాలజిస్టును సంప్రదించగా.. ‘అవసరం లేకుండానే పీజీటీ చేయించారు. మీకు కేవలం కొన్ని హార్మోనల్ అసమతుల్యతలు మాత్రమే ఉన్నాయి’ అని చెప్పారు.
దాతలను ముంచుతున్నరు
హైదరాబాద్ లోని ఓ ఫెర్టిలిటీ సెంటర్లో అండాలను దానం చేసే ఒక యువతి నుంచి నిబంధనల కంటే (ఒక సంవత్సరంలో నాలుగు సార్లు) ఎక్కువ సార్లు అండాలను సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ఒక్కోసారి రూ. 20 వేల నుంచి 30 వేల వరకు ఇస్తామని చెప్పి, ఆమె ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ చూపకుండానే అధిక సంఖ్యలో అండాలను సేకరించి, వాటిని అనేక మందికి అమ్మి సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. దీనివల్ల ఆ యువతి ఆరోగ్యం దెబ్బతింది.